Jayadev_Galla_KTR_World_Economic_Forumతెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలను తెచ్చుకోవడానికి ప్రస్తుతం దావోస్ సదస్సులో పాల్గొంటున్న ఆ రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌, ఆ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టిడిపి ఎంపీ గల్లా జయదేవ్‌తో భేటీ అయ్యారు. వారిరువురూ కలిసి దిగిన ఫోటోలను ఇద్దరూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

“మా పారిశ్రామిక స్నేహితుడు జయ్ గల్లాని కలవడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది,” అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేస్తూ గల్లా జయదేవ్‌తో దిగిన ఫోటోని పోస్ట్ చేయగా, దానిని రీట్వీట్ చేస్తూ “తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ని దావోస్‌లో ఇలా కలవడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఈ సందర్భంగా మా అమర్‌రాజా బ్యాటరీస్‌ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న లియాన్ బ్యాటరీ ప్లాంట్‌, గిగా ఫెసిలిటీ మరియు ఇన్నోవేషన్ హబ్‌ల గురించి ఆయనకి వివరించాను,” అని చెపుతూ కేటీఆర్‌తో దిగిన ఫోటోలని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మద్య అనేక అంశాలపై విభేధాలు, కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి. ఇక టిడిపిని కేసీఆర్‌ రాజకీయ శత్రువుగా భావిస్తుంటారు. కానీ అమర్‌రాజా బ్యాటరీస్‌ వలన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది కనుక రాష్ట్రాలని, రాజకీయాలని, పార్టీల మద్య విభేధాలని అన్నిటినీ పక్కనపెట్టి మంత్రి కేటీఆర్‌ గల్లా జయదేవ్‌తో భేటీ అయ్యారు. తమ రాష్ట్రానికి ఒకటీ రెండూ కాదు… ఏకంగా రూ.9,500 కోట్లు పెట్టుబడులు సాధించుకొన్నారు!

కానీ ఏపీ మంత్రులు మాత్రం ‘పోతే పోనీ….’ అన్నట్లు వ్యవహరిస్తుండటం విస్మయం కలిగిస్తుంది. గల్లా జయదేవ్‌తో మాట్లాడి ఏపీలో పెట్టుబడులు పెట్టించడం మాట దేవుడెరుగు కనీసం మర్యాదపూర్వకంగా కలిసేందుకు కూడా ఇష్టపడరు. ఇదే ఏపీ, తెలంగాణ పారిశ్రామిక విధానాలలో ఉన్న పెద్ద తేడా… అందుకే తెలంగాణకి పెట్టుబడులు, పరిశ్రమలు క్యూ కడుతున్నాయి.
Jayadev_Galla_KTR- (3)

Jayadev_Galla_KTR- (3)

Jayadev_Galla_KTR- (3)