KTR Assemblyతెలంగాణ సిఎం కేసీఆర్‌ ఏదో ఓ రోజు తన కుమారుడు, మంత్రి కేటీఆర్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతారని అందరికీ తెలుసు. అయితే ఎప్పుడనేదే ప్రశ్న. దీనికి సమాధానం మొన్న శాసనసభలో చూచాయగా ఇచ్చిన్నట్లే ఉన్నారు.

సాధారణంగా బడ్జెట్‌ సమావేశాలకి ముందు గవర్నర్‌ ఉభయసభల సభ్యులని ఉద్దేశ్యించి ప్రసంగించడం, మర్నాడు రాష్ట్ర ప్రభుత్వం దానిపై సభలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి చర్చించడం, సభ్యుల ప్రశ్నలు లేదా విమర్శలకి ముఖ్యమంత్రి సమాధానాలు చెప్పడం ఆనవాయితీ.

అయితే మొన్న సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ శాసనసభకి రాకుండా తన కుమారుడు కేటీఆర్‌కి ఆ బాధ్యత అప్పగించారు. అనివార్య పరిస్థితులలో మాత్రమే ముఖ్యమంత్రికి బదులు వేరొక మంత్రి ఎవరైనా ఈ బాధ్యత నిర్వర్తిస్తారు. కానీ అటువంటి అనివార్య పరిస్థితులు ఏవీ లేనప్పటికీ సిఎం కేసీఆర్‌ బదులు మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొని తమ ప్రభుత్వం గొప్పదనం గురించి చెప్పుకొంటూ, ప్రధాని నరేంద్రమోడీని విమర్శిస్తూ మంత్రి కేటీఆర్‌ అనర్గళంగా సుమారు గంటసేపు సభలో ప్రసంగించారు. అలాగే మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలకి ధీటుగా జవాబు ఇచ్చారు.

మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై కఃర్చ జరగడంతో బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేటీఆర్‌కి తెలంగాణ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేస్తారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఈనెల 17న కేసీఆర్‌ పుట్టినరోజునాడు తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు. కనుక ‘కొడుకుకి ప్రేమతో’ ఇచ్చే అపూర్వమైన బహుమతిగా కేటీఆర్‌ని ముఖ్యమంత్రిని చేసి, కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్‌లో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికలలోగా సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్‌ పార్టీని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి విస్తరించాలనుకొంటున్నారు. కనుక ఆయన జాతీయ రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టాలంటే ముఖ్యమంత్రి బాధ్యతలు వదులుకోవలసి ఉంటుంది. కనుక అన్ని సవ్యంగా సాగితే ఫిభ్రవరి 17వ తేదీన లేదా ఉగాదినాడు కేటీఆర్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం ఖాయమనే భావించవచ్చు.