Gudivada Amarnath KTRతెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించే స్థాయికి చేరుకొంటే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం మా రాజధాని ఎక్కడ?అని సుప్రీంకోర్టులో, పార్లమెంటులో అడుకొంటూ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరింది. ఇందుకు వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం సిగ్గుపడుతున్నట్లు లేకపోవడం ఆంధ్రా ప్రజల దౌర్భాగ్యమే అనుకోక తప్పదు.

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ తెలంగాణ రాష్ట్రానికి ఏటా లక్షల కోట్లు పెట్టుబడులతో భారీగా పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలని ఆకర్షిస్తూ, తెలంగాణ జిల్లాలలో కూడా ఐ‌టి హబ్‌లు ఏర్పాటు చేయిస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మున్సిపల్ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న కేటీఆర్‌, రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పార్కులు, చెరువులు, ట్యాంక్‌బండ్‌లు, సమీకృత మార్కెట్లు, వంతెనలు నిర్మింపజేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే సుమారు 30కి పైగా ఫ్లైఓవర్‌లు, ఓ కేబిల్ బ్రిడ్జి నిర్మింపజేశారు.

కనుక ఆయన ముందు ఏపీ ఐ‌టి, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ సిగ్గుతో తలదించుచుకోవాలి. కానీ హైదరాబాద్‌ వెళ్ళి ఆయనతో ఫోటోలు దిగారు. ఆ తర్వాత ఈ-రేసింగ్ పోటీలని చూసి ఆనందించారు కూడా!

అనంతరం “ఏపీలో ఫార్ములా ఈ రేసింగ్ ఎప్పుడు నిర్వహిస్తారంటూ” విలేఖరులు అడిగిన ప్రశ్నలో వ్యంగ్యం అర్దమైనప్పటికీ, మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి కాన్నట్లే నటిస్తూ, “తెలుగు ప్రజలందరూ గర్వపడేలా అందరం కలిసి హైదరాబాద్‌ని నిర్మించుకొని, ఈ పోటీలు నిర్వహించుకొన్నాము. హైదరాబాద్‌ ఈ స్థాయికి అభివృద్ధి చెందడంలో ఆంధ్రా ప్రజల భాగస్వామ్యం కూడా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉంది. కోడి గుడ్డు పెట్టగలదు కానీ కోడి కోడిని పెట్టలేదు కదా?ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది. కోడిపెట్టగా మారడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడు మేము తప్పకుండా మా విశాఖ రాజధాని నగరంలో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహిస్తాము,” అని చెప్పారు.

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించి అమరావతి నిర్మాణ పనులు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారు. ఒకవేళ ఆ రెంటినీ జగన్ ప్రభుత్వం అదే ఊపుతో కొనసాగించి ఉండి ఉంటే ఈపాటికి కోడిపెట్ట కళ్ళ మందు తిరుగాడుతూ కనబడేది. కానీ గుడ్డు పెట్టబోతున్న ఆ కోడిని వైసీపీ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా కోసుకుతినేయడంతో కోడీ లేదు… గుడ్లు లేవూ.. పెట్టలు లేకుండా పోయాయి!

పైగా బలవంతంగా విశాఖ రాజధాని అనే గుడ్డు పెట్టాలని వైసీపీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. అది పెట్టబోయే గుడ్డు ముందే కుళ్ళిపోయిందని తెలిసి ఉన్నప్పటికీ అదే మహాద్భుతమని గుడివాడతో సహా మంత్రులందరూ నమ్మబలుకుతున్నారు. ఏపీలో ఫార్ములా ఈ రేసింగ్ పోటీల సంగతి తర్వాత ముందు నెలనెలా 1వ తేదీన ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి జీతాలు చెల్లించగలిగే స్థాయికి ప్రభుత్వం చేరుకొంటే చాలు!