Dear KTR, Your Hard-Earned Image is At Stakeతెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీహెచ్ఎంసి ఎన్నికలలో అధికార పార్టీ ఇబ్బంది పడుతుందని వార్తలు వస్తున్న తరుణంలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో 74 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారు ఇచ్చే తీర్పు రిఫరెండమ్ కాదని అనలేమని ఆయన స్పష్టం చేశారు.

కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముఖ్యమైనవే. అలాగని ఈ ఎన్నికను భూతద్దంలో చూడాల్సిన పనికానీ, విస్మరించాల్సిన అవసరం కానీ లేదు. అన్ని ఎన్నికల మాదిరిగానే గ్రేటర్‌ ఎన్నిక కూడా ప్రజల మనోగతాన్ని ప్రతిబింబిస్తుంది. మేము పనిచేశాం కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు మాకు బలమైన మెజారిటీ ఇస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.

దుబ్బాక ఎన్నికల సమయంలో బీజేపీ గురించి లైట్ గా మాట్లాడిన తెరాస నేతలు ఆ తరువాత ఆ ఉపఎన్నిక ఫలితాలతో కంగుతున్నారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం మాత్రం బీజేపీ టార్గెట్ గానే చేస్తున్నారు. ఒక్కో ఖాతాలో రూ.15 లక్షలు జమ, నల్లధనం ఎక్కడికి పోయాయి? కేంద్ర ప్రభుత్వ దివాళాకోరు విధానాలతో దేశంలో తొలిసారి ఆర్థిక మాంద్యం వచ్చిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.

అలాగే ప్రతి ప్రచారసభలో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి నయాపైసా సాయం అందలేదని, పెయిడ్‌ వర్కర్స్‌ను పెట్టుకుని గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విషం చిమ్ముతోందని ఆరోపిస్తున్నారు. అయితే ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలియాలంటే డిసెంబర్ 4 వరకు ఆగాల్సిందే.