KTR fires on Digvijaya Singhఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి అయిన దిగ్విజయ్ సింగ్ కు తెలంగాణా ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ పోరులో ఫైనల్ గా కేటీఆర్ పైచేయి సాధించడం విశేషం. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ స్కాంను ఉదహరిస్తూ… డిగ్గీ రాజా చేసిన ట్వీట్ గుక్క తిప్పుకోలేని జవాబిచ్చాడు కేటీఆర్.

“తెలంగాణాలో భారీ డ్రగ్స్ స్కాం బయటపడింది. ఇందులో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా ఉన్నారని తెలుస్తోంది. అయితే వారిని రక్షిస్తారో లేక విచారణ చేస్తారో వేచిచూద్దాం…” అంటూ తెలంగాణా సర్కార్ మీద ఓ రాయి వేసే ప్రయత్నం చేసిన డిగ్గీ రాజాకు, కేటీఆర్ తనదైన శైలిలో దిమ్మతిరిగే జవాబిచ్చారు. దీంతో నెట్టింట వీరిద్దరి సంభాషణ వైరల్ హాట్ టాపిక్ అయ్యింది.

“వినయపూర్వకంగా డిగ్గీరాజాను ‘సార్’ అని సంభోధించిన కేటీఆర్… మీకు మొత్తంగా మైండ్ పోయినట్లుంది. ఇకనైనా మర్యాద పూర్వకంగా రాజకీయాల నుండి రిటైర్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. మీ వయసుకు తగ్గట్లుగా ప్రవర్తించండి… ఎట్టకేలకు ‘తెలంగాణా’ స్పెల్లింగ్ మీకు కరెక్ట్ గా వచ్చినందుకు గర్విస్తున్నాను…” అంటూ మొత్తం కాన్సెప్ట్ ను ఎటకారం చేసేసారు కేటీఆర్.

అయితే కేటీఆర్ చేత ఇలా అక్షింతలు వేయించుకోవడం డిగ్గీ రాజాకు ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ టీఆర్ఎస్ పై ఇలాంటి ఆరోపణలే చేయాలని ప్రయత్నించి, కేటీఆర్ ట్వీట్లకు బలయ్యాడు. ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ కావడం విశేషం. అసలు విషయం ఏమిటంటే… డిగ్గీ రాజా ఆరోపించినట్లుగా అసలు ఇంతవరకు ఏ టీఆర్ఎస్ నాయకుడు పేరు కూడా ప్రత్యక్షంగా ఈ డ్రగ్స్ కేసులో తెరపైకి రాలేదు.