KTR Fans in Andhra pradeshతెలంగాణ రాష్ట్ర సమితిని “తెలుగు రాష్ట్ర సమితి”గా మారుస్తామన్న విషయాన్ని ఏం చేశారు? ఓ మీడియా విలేఖరి ప్రశ్న. ఇది వినగానే చిరునవ్వు చిందించిన తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్… “అవును నిజమే! అక్కడ కూడా ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు, తెలుగు రాష్ట్ర సమితిగా మార్చాలేమో” అంటూ చమత్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటామని, అయితే తెలంగాణ ఓ పిసరు ఎక్కువ బాగుండాలని కోరుకుంటామని అన్నారు. హుదూద్ సమయంలో విశాఖకు, అమరావతికి, శ్రీశైలం నీరు విడుదల సందర్భాల్లో టీఆర్ఎస్ ఏపీ ప్రజలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు బాగుండడమే తమ ఆకాంక్షగా చెప్పుకొచ్చారు.

గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన క్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ శాసన సభకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందా? సనత్ నగర్ నియోజకవర్గ పరిథిలోని 6 కార్పొరేషన్ స్ధానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించిందంటే తలసానిపై ప్రజలు విశ్వాసం ఉంచినట్లే కదా! అయితే అది స్పీకర్ పరిధిలోని అంశమని, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానిని శిరసా వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేసారు.

పురపాలన అంటే అదేదో ప్రజలకు సంబంధం లేని వ్యవహారంలా ఇప్పటివరకు నడించిందని, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న 34 వేల కాలనీ సంఘాలను పురపాలనలో భాగస్వాములను చేస్తామని, మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రజల ప్రాధాన్యతల వారీగా పనులను సమీక్షిస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు. 15 రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు వచ్చేలా రూపకల్పన చేశామని, ఆ లోగా అనుమతులు రాని పక్షంలో, సదరు పనికి అనుమతి లభించినట్టు భావించాలని, అనుమతినివ్వడంలో అలసత్వం ప్రదర్శించిన అధికారికి జరిమానా విధిస్తామని… ఇలాంటి కఠినతరమైన నిబంధనలను అమలు చేస్తామని అన్నారు. కేటీఆర్ తాజా వ్యాఖ్యలతో మున్సిపల్ శాఖను కేటీఆర్ కు కేసీఆర్ కట్టబెడుతున్నట్టు చెప్పకనే చెప్పారు.