ktr confident on 2023 elections hatrick win againతెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “షెడ్యూల్ ప్రకారం 2023లోనే ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలలో మాకు 90కి పైగా సీట్లు వస్తాయి. రాష్ట్రంలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము. సిఎం కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి హ్యాట్రిక్ కొడతారు,” అని అన్నారు.

పదిరోజుల క్రితమే “ముందస్తుకి మేము రెడీ…మీరూ రెడీయేనా?” అంటూ సిఎం కేసీఆర్‌ కేంద్రానికి సవాలు విసిరారు. కానీ ఇప్పుడు ఆయన కుమారుడు 2023లో నే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించడం విశేషం. కేసీఆర్‌ తమకు 100కి పైగా సీట్లు వస్తాయని చెపితే కేటీఆర్‌ 90కి పైగా సీట్లు వస్తాయని చెప్పడం మరో విశేషం.

సిఎం కేసీఆర్‌ ముందస్తుకి సిద్దమని సింహంలా గర్జించి ఇప్పుడు అడుగు వెనక్కు వేస్తున్నారు?ఎన్నికలు రాక మునుపే వంద సీట్ల నుంచి 90కి తగ్గడాన్ని ఏమనుకోవాలి?

మొన్న ఆరా సర్వే, మర్నాడు ఆత్మసాక్షి సర్వే నివేదికలే కారణమా? అంటే అవుననే అనుకోవలసి ఉంటుంది.

ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్‌కు 38.88 శాతం మాత్రమే ఓట్లు పడతాయని, ఇది గత ఎన్నికల కంటే సుమారు 8 శాతం తక్కువని చెప్పింది. కానీ గత ఎన్నికలతో పోలిస్తే బిజెపికి సుమారు 24 ఓటు శాతం పెరిగి 30.48 శాతం వస్తుందని చెప్పింది.

ఆరా తరువాత ఆత్మసాక్షి సర్వేలో రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్‌ పార్టీకి 56-59 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. గత ఎన్నికలతో టిఆర్ఎస్‌కు 41.71 ఓట్ల శాతం రాగా, ఈసారి 39.5 శాతం వస్తాయని ఆత్మసాక్షి సర్వే చెప్పింది.

రెండు సర్వే సంస్థలు టిఆర్ఎస్‌ గెలుస్తుందని చెపుతున్నప్పటికీ ఓట్ల శాతం తగ్గిపోతుందని చెపుతున్నాయి. ఈ సర్వేలు భూటకమని టిఆర్ఎస్‌ కొట్టిపడేసినప్పటికీ, వాటి హెచ్చరికళను పట్టించుకోకుండా గుడ్డిగా ముందుకు వెళ్ళడం మంచిది కాదనే సిఎం కేసీఆర్‌ వెనక్కు తగ్గి ఉండవచ్చు. అదే విషయం తన నోటి ద్వారా చెపితే ప్రతిపక్షాలు, ప్రజలు నవ్వుకొంటారు కనుక కేటీఆర్‌ ద్వారా చెప్పించి ఉండవచ్చు.