KTR comments on KCR return gift to andhra pradeshతప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేలు పెడతాం చంద్రబాబు కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని పలుమార్లు చెప్పుకొచ్చారు తెరాస నేతలు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకూ అందరూ ఇలా మాట్లాడిన వారే. అయితే ఉన్నఫళంగా కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. కేటీఆర్ ఏమో తూచ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో, అక్కడి రాజకీయాలతో మాకేం పని అని మాట మార్చేశారు. అసలు చంద్రబాబుకు ఇస్తామన్న రిటర్న్ గిఫ్ట్ ఆంధ్రాలో కాదు తెలంగాణాలో అంటున్నారు తాజాగా.

“ఎన్టీఆర్ కంటే కేసీఆర్ పేరు ఎక్కువ తల్చుకుంటున్నారు చంద్రబాబు. రిటర్న్ గిఫ్ట్ ఇప్పటికే ఇచ్చేశాం. తెలుగుదేశం పార్టీని ఇప్పటికే ఇక్కడ లేకుండా చేసేశాం అదే రిటర్న్ గిఫ్టు చంద్రబాబుకు,” అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అదేంటి రిటర్న్ గిఫ్టు ఆంధ్ర రాజకీయాలలో కదా ఇస్తాం అని చెప్పారు కదా అని అడగగా.. “సొంతగా ఓట్లు అడగడానికి మొహం లేక కేసీఆర్ ని అడ్డుపెట్టుకుంటున్నారు. ఆంధ్ర ఎన్నికలలో మాకు పని లేదు. ఆంధ్రని ఏలాలని మాకు లేదు. తెలంగాణాలో మాకు కావాల్సినంత పని ఉంది,” అని చెప్పుకొచ్చారు.

అవసరాన్ని బట్టి వైఎస్సార్ కాంగ్రెస్ తో మాత్రం జాతీయ రాజకీయాలలో కలిసి పని చేస్తాం అని చెప్పుకొచ్చారు. దీని బట్టి ఆంధ్ర రాజకీయాలలో వేలు పెడతాం అని బాహాటంగా ప్రకటించుకున్న తెరాస తన తప్పు తెలుసుకునట్టుగా కనిపిస్తుంది. తాము ఎక్కువ మాట్లాడితే అది చంద్రబాబుకే బెనిఫిట్ అవ్వుతుందని తెలుసుకుని అసలు మాకేం సంబంధం లేదు ఆంధ్ర రాజకీయాలలో అంటూ పక్కకు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏప్రిల్ 11 తరువాత కూడా ఇదే మాట మీద నిలబడతారేమో చూద్దాం.