KTR_Telanganaతెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య జరుగుతున్నా ఆధిపత్యపోరు మొన్న కేంద్రహోంమంత్రి అమిత్ షా పర్యటనతో మరో స్థాయికి చేరింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన బహిరంగసభలో అమిత్ షాతో సహా బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించక తప్పదని అన్నారు.

అయితే టిఆర్ఎస్‌ మంత్రులు ఇచ్చిన సమాధానానికి బిజెపి సైతం నోరు విప్పలేని పరిస్థితి ఏర్పడింది. “ఓ అసమర్దుడు, దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్న ప్రధాని నరేంద్రమోడీనే ముందు గద్దె దించాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బిజెపికి దమ్ముంటే తక్షణం లోక్‌సభను రద్దు చేసి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. అందుకు ప్రధాని నరేంద్రమోడీ సిద్దమైతే సిఎం కేసీఆర్‌ కూడా శాసనసభను రద్దు చేసి ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నారని చెప్పారు.

దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలను కూడా తెలంగాణ రాష్ట్రమే పోషిస్తోందని బిజెపి గ్రహించాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశానికి వెన్నెముకగా నిలిచిన తెలంగాణ కాళ్ళు (?) కడిగి బిజెపి నేతలు నెత్తిన జల్లుకోవాలని అన్నారు. సిఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తుంటే, కేంద్రంలో ఇద్దరు గుజరాతీలు (ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ కేంద్రహోంమంత్రి అమిత్ షా)లు కలిసి దేశాన్ని మరో ఇద్దరు గుజరాతీలకు (అంబానీ, అదానీ)లకు అమ్మేస్తున్నారంటూ మంత్రి కేటీఆర్‌ ఘాటుగా విమర్శించారు. మిగిలిన మంత్రులు కూడా బిజెపి, కేంద్రప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలపై చాలా ఘాటుగా విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి బిజెపి అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తుంటే, కేంద్రంలో బిజెపిని గద్దె దించాలని టిఆర్ఎస్‌ ప్రయత్నిస్తుండటం విశేషం. రెండు పార్టీల ప్రయత్నాలలో దేనివి ఫలిస్తాయనేది పక్కన పెడితే, దేశంలో బిజెపికి, కేంద్రానికి ఇటువంటి సవాల్ విసిరిన తొలి పార్టీ టిఆర్ఎస్‌ పార్టీయే. ఒక ప్రాంతీయ పార్టీ అయిన టిఆర్ఎస్‌ ఈ స్థాయిలో కేంద్రాన్ని ఎదుర్కొంటుండటం దాని ఆత్మవిశ్వాసానికి, బలానికి, ప్రజాధారణకు నిదర్శనంగా భావించవచ్చు.

అలాగే టిఆర్ఎస్‌ ఇంత బలంగా ఉందని తెలిసి ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోనే అధికారం కైవసం చేసుకోవాలని బిజెపి ఇంత గట్టిగా, పట్టుదలగా ప్రయత్నిస్తుండటం చాలా ఆశ్చర్యకరమైన విషయమే. వాటి మద్య ఈ ఆధిపత్యపోరుకి అసలు కారణం కూడా ఇదే.