KTR challemges Rajakeeya Sanyasamసోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ విపక్షాలకు సవాల్ విసిరారు. డిసెంబర్ లో జరగబోయే ఎన్నికలలో తెరాస సునాయాసంగా గెలుస్తుందని, 100 సీట్లు పైగా వస్తాయని ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పారు. అక్కడితో ఆగకుండా ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం చెయ్యడానికి సిద్ధమని, మీకు దమ్ముందా అని విపక్షాలకు సవాల్ విసిరారు.

నవ తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని.. విభజన సమయంలో లేవనెత్తిన అనుమానాలు తెరాస ప్రభుత్వ హయాంలో నివృత్తి అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదని ప్రచారం చేశారని, తలెత్తుకుని చెప్పుకునే విధంగా పాలించామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే తెలంగాణ తలమానికంగా నిలిచిందని చెప్పారు.

ఇరుగుపొరుగు రాష్ట్రాలతో కయ్యానికి కాలుదువ్వకుండా స్నేహపూర్వకంగా వ్యవరించి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్లు ఆశ్చర్యపోయే విధంగా పాలన చేస్తున్నామని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎప్పుడూ స్వయం ప్రకాశంలేని చంద్రుడని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. అవకాశం కోసం అందరితో పొత్తు పెట్టుకునే నైజం చంద్రబాబుదని, భవిష్యత్‌లో వైసీపీతో కూడా పొత్తుకుంటే ఆశ్చర్యపోనవసరంలేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఎన్నికల ప్రచారంలో తెరాస దూసుకుపోతుంది. ఇప్పటిదాకా 117 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించి మిగిలిన పార్టీల కంటే ముందంజేలో ఉంది. కోదాడ, ముషీరాబాద్ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటిదాకా వచ్చిన జాతీయ మీడియా సర్వేలలో రెండు తప్ప అన్నీ తెరాస మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పాయి.