.
Gudivada Amarnath KTRవిశాఖపట్నంలో రేపు, ఎల్లుండి (మార్చి 3,4)న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ జరుగబోతున్న నేపధ్యంలో తెలంగాణ ఐ‌టి పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ఏపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. దాని కింద ఏపీ ఐ‌టి పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ‘బిగ్‌ బ్రదర్ హైదరాబాద్‌’ అంటూ నగర అభివృద్ధిని ప్రశంశిస్తున్న వార్తని ట్యాగ్ చేశారు. అంటే తమకి అభినందనలు తెలిపినందున తాము కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు అనిపిస్తుంది.

ఇంతకీ మంత్రి కేటీఆర్‌ ఏం ట్వీట్‌ చేశారంటే, “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ నిర్వహిస్తున్న తమ్ముడు వైజాగ్, సోదరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కి గుడ్ లక్‌! అంతా మంచి జరగాలని కోరుకొంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెంది దేశంలో అత్యుత్తమైన రాష్ట్రాలుగా నిలవాలని కోరుకొంటున్నాను,” అని వ్రాశారు.

హైదరాబాద్‌ని ‘బిగ్‌ బ్రదర్’ అని, విశాఖని రాజధానిగా చేసి దాంతో పోటీ పడతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి అన్నారు కనుక కేటీఆర్‌ విశాఖని తమ్ముడని సంభోదించిన్నట్లు భావించవచ్చు.

ఏపీకి రాజధాని లేకపోయినా, ముఖ్యమంత్రి, ఐ‌టి మంత్రి పరిశ్రమలు, పెట్టుబడులని ఆకర్షించడానికి గట్టిగా ప్రయత్నాలు చేయకపోయినా ఈ ఒక్క గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తోనే ఏపీకి రెండు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తాయంటూ గుడివాడ అమర్నాథ్ రెడ్డి గొప్పలు చెప్పుకొంటున్న సంగతి తెలిసిందే.

కానీ పరిశ్రమలని, పెట్టుబడులని సాధించడానికి ఎంతగా తిరగాలో, ఎంతగా శ్రమపడాలో, రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ వాతావరణం, ప్రభుత్వ విధానాలు, పాలసీలు, సదుపాయాలు కలిగి ఉండాలో తెలంగాణకి లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువస్తున్న మంత్రి కేటీఆర్‌కి బాగా తెలుసు.

కనుక ఈ ఒక్క సదస్సుతో రెండు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తాయని ఆశపడుతున్న లేదా ఆంధ్రా ప్రజలని భ్రమింపజేయాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్‌కి తెలుసు. బహుశః అందుకే గుడ్ లక్‌ (అదృష్టం కలిసి రావాలని) వ్యంగ్యంగా అన్నట్లుంది!
అయితే మన మంత్రులు ఇంట్లోనుంచి కాలు బయటపెట్టకుండా, ప్రతిపక్షాలని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నా రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలిగితే వారి ముందు మంత్రి కేటీఆర్‌ ఎందుకు పనికిరారనే చెప్పొచ్చు.