TRS KTRఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ పోలీసుల రహస్య సర్వే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కలకలం రేపుతోంది. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసుల సర్వే అంటూ వస్తున్న ఆరోపణలు పలు అనుమానాలకు దారి తీస్తోంది. మంత్రి కేటీఆర్ ఏకంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ పోలీసుల ద్వారా చంద్రబాబు తెలంగాణాలో డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? అభ్యర్థుల విజయావకాశాలపై స్థానికులతో ఆరా తీస్తున్నారని స్థానిక తెరాస నేతల అభియోగం. ఏపీ పోలీసులు రాష్ట్రంలో సర్వే నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు మంత్రి కేటీఆర్‌ ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌ సైతం ఈ విషయాన్ని తేల్చని ఏపీ డీజీపీని ఆదేశించారు.

అయితే ఈ అభియోగం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. సహజంగా సర్వేలు చెయ్యడానికి చాలా సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా పకడ్బందీగా సర్వేలు చేసే సంస్థలు ఉన్నవి. వాటితో ఆయన నిత్యం పార్టీ పనితనాన్ని అంచనా వేస్తూ ఉంటారు. ఇటీవలే కాలంలో ఆయనకు లగడపాటి రాజగోపాల్ కూడా తోడయ్యారు.

లగడపాటి తరచుగా సీఎంని కలుస్తూ తన సర్వే నివేదికలు అందిస్తున్నారు. ఖచ్చితమైన సర్వేలకు లగడపాటి పెట్టింది పేరు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ఏకంగా సర్వేల కోసం ఇంటెలిజెన్స్‌ పోలీసులను రంగంలోకి దించాల్సిన అవసరం ఏముంది? ఇది ఎన్నికల తరుణంలో తెరాస చేస్తున్న రాజకీయ విమర్శలేనా?