KTR - Federal Frontతెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కొత్త నినాదం ఇచ్చారు. సారు ప్లస్ కారు ..డిల్లీ సర్కారు అన్న నినాదాన్ని ఆయన ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ కూటములకు మెజారిటీ రాదని.. కేసీఆర్‌ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలకం కాబోతుందని అయన జోస్యం చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి వచ్చే ఎన్నికల్లో 150 నుంచి 160 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు.

ఇక కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరిస్థితి మరింత దిగజారిందని.. ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏకు 110 సీట్లు రావడమే కష్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచే 16 మంది ఎంపీలే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో నిర్ణయిస్తారన్నారు. ఎన్నికల తర్వాత దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటవుతుందని, కేసీఆర్‌ నేతృత్వంలోని కొత్త కూటమి 100పైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భావసారూప్యతగల పార్టీలతో కేసీఆర్ ఇప్పటికే టచ్ లో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే అసలు ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎక్కడ ఉందో ఎంత వెతికినా దొరకని పరిస్థితి. కేసీఆర్ కొంత మంది జాతీయ నాయకులను కలిసినా వారెవ్వరూ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వలేదు. ఏదో మర్యాదపూర్వకంగా కలిసిన వారందరినీ మా వారే అని లెక్క వేసేసుకుంటున్నారు కావొచ్చు. పార్లమెంట్ ఎన్నికలలో సహజంగా జాతీయ పార్టీలకు ఉండే అనుకూలతలను ఎదురుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి వేస్తున్న ఎత్తుగడ కావొచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.