Krishnam Raju Passed Awayమాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ ఏఐజీ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రజలకు పరిచయమే అవసరం లేని గొప్ప నటుడు కృష్ణంరాజు. ఆయన పేరు తలుచుకోగానే ఆయన నటించిన అలనాటి సూపర్ హిట్ సినిమాలు జీవన తరంగాలు, కృష్ణవేణి, కటకటకటాల రుద్రయ్య, తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప మొదలు చివరిగా పరమహంసగా చేసిన రాధేశ్యామ్ వరకు ఎన్నెన్నో సినిమాలు మన కళ్ళలో కదలాడుతాయి. ఆయన చేయని పాత్రలేదు… చేసి మెప్పించని సినిమా లేదు.

1966లో చిలుకా గోరింక సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 187 సినిమాలు చేశారు. వాటిలో మూడొంతులకుపైగా సూపర్ హిట్లే.. వందరోజులు ఆడిన సినిమాల లెక్కే లేదు.

కృష్ణంరాజు 1990లో బిజెపి ద్వారా రాజకీయాలలోకి ప్రవేశించి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇంత అత్యున్నతస్థాయికి ఎదిగిన పరిపూర్ణమైన జీవితం గడిపిన కృష్ణం రాజు చివరి రోజులు మాత్రం చాలా నరకం అనుభవించారు.

వైద్యులు ఆయన మరణానికి గల కారణాలు చెప్పినప్పుడు గానీ ఆయన అనుభవించిన కష్టం లోకానికి తెలియలేదు. చిరకాలంగా మధుమేహం ఉన్నందున దీర్గకాలిక ఊపిరితిత్తుల వ్యాది (సీవోపీడీ)తోపాటు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. మధుమేహం కారణంగా గత ఏడాది ఆయన పాదం తొలగించవలసి వచ్చిందని చెప్పారు.

ఈ పరిస్థితులలో కరోనా సోకడంతో మళ్ళీ హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకొని కోలుకొన్నాక ఇంటికి తిరిగిరావడంతో అందరూ చాలా సంతోషించారు. కానీ మళ్ళీ కరోనా కారణంగా మళ్ళీ అనేక ఇతరత్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు మళ్ళీ 27 రోజుల క్రితం ఏఐజీ హాస్పిటల్‌లో చేర్చారు. అప్పటి నుంచి ఆయనని వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి గుండెకు సంబందించిన అనేక సమస్యలు వచ్చాయి. వాటికి చికిత్స అందిస్తుండగానే బాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా సోకాయి. శనివారం రాత్రి ఆయన మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. దాంతో గుండెపోటు(కార్డియాక్ అరెస్ట్) వచ్చింది. వెంటనే సీపీఆర్ ప్రక్రియతో ఆయనను కాపాడేందుకు ఎన్నిప్రయత్నాలు చేసినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.

కృష్ణం రాజు మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు సంతాపం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌ ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబోతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.

ఇవాళ్ళ మధ్యాహ్నం ఒంటిగంటకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. తన జీవితంలో చివరి రోజులు అక్కడే గడపాలని అక్కడ ఇల్లు కట్టుకొంటున్నారు. కానీ ఆ ఇంటి నిర్మాణం పూర్తికాక మునుపే కృష్ణం రాజు మరణించడంతో అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.