ఇటీవలే రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఆయన ఆరోగ్యం గురించి అనేక వదంతులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన కోలుకుని తన ఆరోగ్య విషయంపై క్లారిటీ ఇచ్చారు. తాను పూర్తిగా కోలుకున్నానని ప్రకటించారు. కొద్ది రోజుల పాటు వైరల్ ఫీవర్ తో బాధపడ్డానని ఆయన చెప్పారు.

తాను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని ఆయన వివరించారు.కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి బంజారాహిల్స్‌లోని శ్రీవిజయగణపతి స్వామి దేవాలయంలో శతచండీ మహాయాగంలో పాల్గొన్నారు. మహాలక్ష్మిదేవికి విశేష పూజలు నిర్వహించారు. తన ఆరోగ్యంపై మీడియాలో తప్పుడు వార్తలు వచ్చాయని, తనకు వచ్చింది మామూలు దగ్గు, జ్వరమేనని ఆయన అన్నారు.

జలుబు, దగ్గు, జ్వరం సాధారణంగా అందరికీ వస్తుంటాయని, అందులో భాగంగా తనకు కూడా ఫీవర్‌ వచ్చిందని, దీనిపై మీడియా తప్పుడు వార్తలు రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు రాసే ముందు ఓసారి తనను సంప్రదించి ఉంటే బాగుండేదన్నారు. గత నాలుగు రోజుల నుంచి చాలా మంది అభిమానులు ఫోన్‌ చేసి తన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని చెప్పారు.

తాను బావున్నానని అందరికీ చెప్పానన్నారు. తనను ఆశీర్వదించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని కృష్ణంరాజు అన్నారు. ఈ క్లారిఫికేషన్ తో కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణంరాజు ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న జాన్ చిత్రం సహనిర్మాతగా ఉన్నారు. అదే విధంగా మోడీ ప్రభుత్వంతో ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గిరి కోసం లాబీయింగ్ చేస్తున్నారు.