Krishnam Raju about Prabhas‘బాహుబలి’ సినిమా రెండు పార్టుల తర్వాత ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ రేంజ్ ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయినప్పటికీ ఆ స్థాయిని ఎక్కడా ప్రదర్శించకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయే ప్రభాస్ విధానాలకు ఫిదా అయ్యే ఫ్యాన్స్ సంఖ్య ప్రస్తుతం కోకొల్లలు అని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23వ తేదీని) పురస్కరించుకుని కృష్ణంరాజు మీడియాకు ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు.

“ప్రభాస్ తన వారసుడని చెప్పుకోవడానికి తాను గర్వపడుతున్నానని” పెదనాన్న, సీనియర్ హీరో కృష్ణంరాజు చేపుకోచ్చారు. “ప్రభాస్ గురించి మూడే మూడు ముక్కలు చెప్తాను…. అందులో ఒకటి… తన సుఖం గురించి ఎప్పుడూ ఆలోచించకుండా ఎంతో అంకిత భావంతో పని చేసే ఆర్టిస్ట్. రెండు.. సినిమాకు సంబంధించిన కథను ప్రతి హీరో వింటాడు. కానీ, ఆ కథ విన్న తర్వాత అది బాగుందో? లేదో? చెప్పడం మామూలు విషయం కాదు. అలా జడ్జ్ చేయడంలో ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్. అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

ఏదైనా కథను వింటే .. దానిని ఏ స్థాయికి తీసుకువెళ్లొచ్చు, ఎలా తీసుకువెళ్లొచ్చనేది ప్రభాస్ చాలా చక్కగా ఆలోచిస్తాడు. మూడోవది.. పర్సనల్ క్యారెక్టర్. మన మధ్య లేని వ్యక్తి గురించి మాట్లాడే తత్వం ప్రభాస్ కు అస్సలు లేదు. ఇది చాలా అరుదుగా ఉంటుంది, అందులోనూ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వారు చాలా అరుదుగా లభిస్తారంటూ ప్రభాస్ గురించి ఎంతో పొంగిపోతూ ఆనందంతో పరవశిస్తూ చెప్పారు ‘అసలు రెబల్ స్టార్.’

ప్రభాస్ ను హీరోగా పెట్టి తెలుగు, హిందీ భాషలలో సినిమా తీస్తామని ఈ మధ్య కాలంలో ఒకళ్లు వచ్చి కలిసి, ఇందుకు గానూ ఎవరూ ఊహించనంత డబ్బులు ప్రభాస్ కు ఇస్తామని ఆఫర్ చేసారు. రెండు, మూడు సినిమాలకు సరిపడా డబ్బులు ఇస్తావు సరే, ఈ సినిమా నువ్వు సరిగా తీయకపోతే? డబ్బులిచ్చాను కదా అనుకుని నీ ఇష్టమొచ్చినట్టు తీస్తే? నాకు కావాల్సింది నీ డబ్బు కాదు. నువ్వు, నీ కథ. ఫస్ట్ నాకు కథ వినిపించు. కథ మీద, నీ మీద నమ్మకం ఉంటే నేను నటిస్తానని చెప్పిన వ్యక్తి ప్రభాస్ అంటూ సగర్వంగా తెలిపారు.

ప్రభాస్ సినిమాల్లోకి రావడానికి ఓ రెండు సంవత్సరాల ముందు ఓ బర్త్ డే పార్టీలో నేను, ప్రభాస్ పోటీపడి డ్యాన్స్ చేశాం. సుమారు 45 నిమిషాల పాటు ఏకధాటిగా చేశాం. ‘సినిమాల్లోకి రావడం ఇష్టమేనా?’ అని ప్రభాస్ ని అపుడు అడిగితే ‘ఇష్టమే’ అన్న తర్వాత వైజాగ్ సత్యానంద్ గారి వద్దకు నటనలో శిక్షణకు పంపించాం. ‘మామూలుగా కొడుకును ఐదు సంవత్సరాల వరకు దేవుడిలా చూడాలి. ఐదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు బానిసలా చూడాలి. పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్నేహితుడిలా చూడాలి’ అని మా నాన్నగారు నాకు చెప్పే వారు. మా నాన్నగారు నన్ను అలానే చూశారు, ప్రభాస్ ని నేనూ అలానే చూస్తున్నాను” అంటూ ప్రభాస్ గురించి చెప్తూ అభిమానులను పులకింపచేసారు.