Ranga Marthandaఒకప్పుడు కృష్ణవంశీ అంటే క్రియేటివ్ బ్రాండ్. నిన్నే పెళ్లాడతా లాంటి ఫ్యామిలీ మూవీతో రికార్డులు బద్దలు కొట్టారు. మాస్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న మహేష్ బాబుని మురారిలో సాఫ్ట్ గా చూపించి మెప్పించారు. ఖడ్గంలో దేశభక్తిని రగిలించేలా వాహ్ అనిపించారు. చందమామ రాకపోతే ఇవాళ కాజల్ అగర్వాల్ లేదు. సిందూరం వల్లే రవితేజలోని నటుడు బయటికి వచ్చాడు. గులాబీ ఇప్పటికీ ఎందరికో ఇష్టం. ఇదంతా గత చరిత్ర. ఈయన ఎప్పుడో లయ తప్పేశారు. మొగుడు, నక్షత్రం లాంటివి మర్చిపోలేని పీడకలలు.

తాజాగా రంగమార్తాండతో వచ్చారు. మరాఠి నటసామ్రాట్ కు అఫీషియల్ రీమేక్. కిందా మీద పడుతూ మూడేళ్లు నిర్మాణంలో ఉంది. ఎట్టకేలకు బయటికి తెచ్చారు. వరసగా ప్రీమియర్లు వేసి వందల మందికి ఫ్రీ షోలు వేశారు. వాళ్ళ పొగడ్తలతో సోషల్ మీడియాలో గట్టి పబ్లిసిటీ దక్కింది. కథగా చెప్పుకుంటే సింపుల్ గానే అనిపిస్తుంది. రంగస్థలం మీద నాటకాలు వేయడంలో దిగ్గజంలా వెలిగిన రాఘవరావు (ప్రకాష్ రాజ్)కు రిటైర్ అయ్యాక వ్యక్తిగత జీవితంలో స్వంత కుటుంబంలోనే ఎదురైన సుఖదుఃఖాల సంగమమే ఈ చిత్రం.

అద్భుతమైన క్యాస్టింగ్ దక్కింది. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం పోటీపడి జీవించారు. చివర్లో వచ్చే ఎపిసోడ్ వాళ్ళెంత గొప్ప నటులో ప్రపంచానికి చాటి చెబుతుంది. రమ్యకృష్ణ సీనియారిటీ గురించి తెలిసిందే. ఆశ్చర్యకరంగా శివాత్మిక, అనసూయ లాంటి ఆర్టిస్టుల నుంచి కూడా మంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నారు. అంతా బాగానే ఉందనిపించింది కానీ కాంటెంపరరీ కథలతో యువదర్శకులు పోటీ పడుతున్న ట్రెండ్ లో ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కమర్షియల్ గా వర్కౌట్ చేయడం పెద్ద సవాలే. వినోదం లేకుండా గుండెను తడిమే కన్నీటి గాథను ఇప్పటి తరం ఓపిగ్గా చూడగలదా.

కృష్ణవంశీ ఎంత చక్కగా తీసినా ఆయనలో మునుపటి స్పార్క్ తగ్గిందన్నది వాస్తవం. ప్రెజెంటేషన్ లో అది స్పష్టంగా కనిపిస్తుంది. నిడివిని భరించే రోజులు కావివి. అందులోనూ సింగల్ లైన్ లో సాగే కథలను వీలైనంత వేగంగానే చెప్పాలి. కానీ కెవి తన పాత స్కూల్ లోనే ఉండిపోయారు. ఇళయరాజా గారి సంగీతం ఏమంత మేజిక్ చేయలేకపోయింది. అంతఃపురం నాటి మెరుపులు ఏవీ లేవు. ప్రొడక్షన్ లో రాజీ వల్ల కాబోలు ఆ ప్రభావం నేరుగా అవుట్ ఫుట్ మీద పడింది. ఎంత బరువున్నా సరే నటీనటుల ప్రతిభ కోసం, ఓ నిజాయితీ రీమేక్ కోసం వెళ్తామంటే రంగమార్తాండ ఒకే కానీ మరీ విపరీతమైన అంచనాలు పెట్టుకుంటే మాత్రం ముందుగానే ఆలోచించుకోవాలి.