Krishna Vamsi Naksahtramఆగష్టు 4వ తేదీన విడుదల కాబోతున్న కృష్ణవంశీ దర్శకత్వం వహించిన “నక్షత్రం” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా దర్శకుడు కృష్ణవంశీ ఇచ్చిన ఇంటర్వ్యూలోని సంగతులు వైరల్ అయ్యి… చివరికి అవి రామ్ చరణ్ వద్దకు వచ్చి ఆగాయి. చాలా నిర్మొహమాటంగా మాట్లాడే కృష్ణవంశీ, తన దర్శకత్వంలో నటించిన ఓ హీరోపై కీలక వ్యాఖ్యలు చేయడంతో, అవి మెగా వారసుడు రామ్ చరణ్ గురించేనని సదరు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలో తన గురించి చెడుగా చెప్పే వారి కంటే మంచిగా చెప్పే వారే ఎక్కువని, అయితే చెడుగా చెప్పే వాళ్ళల్లో ఒక హీరో గురించి తనకు తెలుసని, అతని జ్ఞాపకశక్తి చాలా తక్కువని, రెండు డైలాగ్ ల కంటే ఎక్కువ చెప్పలేడని అన్న కృష్ణవంశీ, సదరు హీరో గారి పేరును మాత్రం వెల్లడించడానికి ఇష్టపడలేదు. ఆ హీరో కనీసం తన పాత్రను కూడా అర్ధం చేసుకోలేడని, అలా చేయి, ఇలా చేయి అంటూ తనకు తోచిన విధంగా సలహాలు ఇస్తే, తనపై ద్వేషం పెంచుకుంటాడని చెప్పుకొచ్చారు.

హీరో పేరు చెప్పకుండా చేసిన ఈ వ్యాఖ్యలు రామ్ చరణ్ ను ఉద్దేశించి అన్నవేనని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఇదే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ప్రశంసలు కురిపిస్తూ కృష్ణవంశీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం గమనించదగ్గ విషయం. రామ్ చరణ్ తో తీసిన ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమాను ఆశించిన మేరకు తీయలేకపోయానని, ఈ విషయంలో చెర్రీకి రుణపడి ఉంటానని, భవిష్యత్తులో చెర్రీ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాను తెరకెక్కించాంలని ఉందన్న ఆకాంక్షను వెలిబుచ్చారు.

వర్మ స్కూల్ నుండి వచ్చిన కృష్ణవంశీ మొహమాటం లేకుండా మాట్లాడతారన్న విషయం ఇండస్ట్రీ వర్గీయులకు సుపరిచితమే. మరి అలాంటి వంశీ పరోక్షంగా చెర్రీని విమర్శించి, ప్రత్యక్షంగా పొగుడుతారంటే నమ్మశక్యం కాని అంశం. ఒకవేళ రామ్ చరణ్ ను ఉద్దేశించి కాకపోతే, మరి ఏ హీరోను ఉద్దేశించి కృష్ణవంశీ ఆ వ్యాఖ్యలు చేసారు? అంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే వంశీ దర్శకత్వం వహించిన మరో ఇద్దరు స్టార్ హీరోలు మహేష్, జూనియర్ ఎన్టీఆర్ లు జ్ఞాపకశక్తిలో ‘కింగ్స్’ అన్న విషయం తెలిసిందే. దీనిపై కృష్ణవంశీనే సెలవిస్తే… ఈ పుకార్లకు బ్రేక్ పడుతుంది.