Bachula Arjunudu, TDP, YSRCP, Krishna district, Rakshana Nidhi, Meka Pratap Apparao, Kodali Sri Venkateswara rao, Kodali Nani, Uppuleti Kalpana,ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు విపక్ష వైసీపీ విలవిల్లాడుతోంది. ఇప్పటికే వైసీపీ టికెట్లపై విజయం సాధించిన 20 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారన్న విషయం పొలిటికల్ వర్గాలకు సుపరిచితమే.

మొన్నటిదాకా కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖ తదితర జిల్లాల్లో కాస్తంత బలంగా కనిపించిన వైసీపీ ప్రస్తుతం బలహీనపడిపోయింది. ఇక పశ్చిమ గోదావరి లాంటి జిల్లాల్లో టీడీపీ బలం ముందు వైసీపీ ఏ మాత్రం తూగలేని పరిస్థితిలో ఉంది. తాజాగా మరో కీలక జిల్లా… కృష్ణాజిల్లాలోనూ వైసీపీ మరింత బలహీనపడే ప్రమాదం లేకపోలేదు. ఈ మేరకు ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు సంచలన ప్రకటన చేశారు.

కృష్ణాజిల్లాలోని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని, వీరిలో నూజివీడు ఎమ్మెల్యే కూడా ఉన్నారని వైసీపీకి డేంజర్ బెల్స్ మోగించారు. గడచిన ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లాలో ఐదు అసెంబ్లీ సీట్లు దక్కాయి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి గెలిచిన జలీల్ ఖాన్ ఇప్పటికే టీడీపీలో చేరిపోవడంతో, ప్రస్తుతం నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే బచ్చుల అర్జునుడు చెప్పిన ప్రకారం ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే… సింగిల్ ఎమ్మెల్యే మాత్రమే ఆ పార్టీలో ఉంటారు.

అర్జునుడు చెప్పిన ప్రకారం… తిరువూరు, నూజివీడు, పామర్రు ఎమ్మెల్యేలుగా ఉన్న రక్షణ నిధి, మేకా ప్రతాప్ అప్పారావు, ఉప్పులేటి కల్పనలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న వీరంతా పలు డిమాండ్లను టీడీపీ ముందు పెట్టారట. ప్రస్తుతం వీటిపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడం ఖాయమేనని అర్జునుడు చెప్పుకొచ్చారు.

ఇదే జరిగితే… ప్రస్తుతం జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రమే వైసీపీకి మిగులుతారు. ఒకవేళ ఈయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నా, టిడిపి మాత్రం అందుకు సిద్ధంగా లేదు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు నిలయంగా ఉన్న కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే కీలకంగా మారడంతో, ఈ జిల్లాలో వైసీపీ తన సంస్థాగత కార్యకర్తలను కోల్పోతే రాజకీయ మనుగడ కష్టసాధ్యంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.