Director-Krish-Sujeeth-Pawan-Kalyan-Harish-Shankar-samuthirakaniస్టార్ హీరో సినిమా ఏదైనా బ్లాక్ బస్టర్ హిట్ సాధించినప్పుడే అభిమానులకు దాని మీద ఆధారపడిన ప్రతిఒక్కరికి సెలెబ్రేషన్. అది ఆర్ఆర్ఆర్ కావొచ్చు అఖండ కావొచ్చు. కోట్ల రూపాయలు కనక వర్షం కురిసినప్పుడు వచ్చే కళ వేరుగా ఉంటుంది. పది కోట్ల లోపు మార్కెట్ తో పరిచయమైన ప్రభాస్ ఇప్పుడు ఒకేసారి రెండు వేల కోట్లకు పైగా తన మీద నాలుగైదు సినిమాల బిజినెస్ చేసే రేంజ్ కు చేరుకోవడం ఛత్రపతి నుంచి బాహుబలి దాకా జరిగిన ప్రయాణమే. చిన్న చిత్రాలు ఎంత విరగబడి అయినా వాటికి ఇంత స్థాయిలో ఆదరణ ఉండదు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ రేంజ్ హీరోకు కనీసం ఏడాదికొకటో లేదా కనీసం రెండేళ్లకొకటో అలాంటివి వస్తూ ఉండాలి

విచిత్రంగా పవర్ స్టార్ చివరి బ్లాక్ బస్టర్ ఎప్పుడు వచ్చిందంటే ఫ్యాన్స్ తడుముకుంటారేమో కానీ అక్షరాలా తొమ్మిది సంవత్సరాలు అయ్యిందనేది నిజం. 2013లో అత్తారింటికి దారేది తర్వాత పవన్ కు ఆ స్థాయి సక్సెస్ రాలేదు. అంతకు ముందు ఏడాది గబ్బర్ సింగ్ తో హరీష్ శంకర్ ఒక మరపురాని విజయం ఇచ్చాక ఆ రెండే గర్వంగా చెప్పుకునే జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. బాలీవుడ్ మూవీ ఓ మై గాడ్ ని గోపాల గోపాలగా రీమేక్ చేస్తే వెంకటేష్ తో ఉన్న కాంబినేషన్ ఫ్రెష్ గా అనిపించి ఓ మోస్తరుగా హిట్ చేశారు తప్ప నిజానికది ఒరిజినల్ వెర్షన్ అంత గొప్పగా ఆడలేదన్నది నిజం. సర్దార్ గబ్బర్ సింగ్ గురించి వీలైనంత తక్కువ మాట్లాడుకోవడం మంచిది.

ఒక సినిమా ఎలా తీయకూడదనే దానికి అత్యుత్తమ ఉదాహరణగా నిలిచిందా కళాఖండం. తెలుగు డబ్బింగ్ వచ్చేసిన వీరంని తిరిగి కాటమరాయుడుగా అందించి ప్రేక్షకుల పల్స్ ని తక్కువ అంచనా వేసినందుకు తగిన మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. ఓపెనింగ్స్ ఘనం ఫలితం పాతాళం తరహాలో వరసగా జరిగిన ఈ పరిణామాలు పవన్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తూ వెళ్లాయి. అజ్ఞాతవాసి అనే చీకటి అధ్యాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. త్రివిక్రమ్ కాబట్టి తట్టుకున్నాడు కానీ లేదంటే దాని దెబ్బకు మరొకరు స్వంత ఊరికి వెళ్ళిపోయి తిరిగి వచ్చేవారు కాదు. వకీల్ సాబ్ పర్లేదనిపించుకుంది కానీ అభిమానులు మోసినంత రేంజ్ లో విరగబడి ఆడలేదు ఇక కొన్ని ఏరియాల్లో భీమ్లా నాయక్ కు వచ్చిన నష్టాలు ట్రేడ్ వర్గాల్లో సీక్రెట్ ఏమీ కాదు.

ఇలా క్రమంగా నూట యాభై కోట్లు తేలికగా రాబట్టే రేంజ్ నుంచి తొంబై కోట్లు అందుకోవడమే గగనంగా మారిపోయే స్థితికి వచ్చాడు పవన్. కాంతారలు కెజిఎఫ్ లు అలవోకగా నాలుగైదు వందల కోట్లు లాగేస్తుంటే పవర్ స్టార్ కు కనీసం సెంచరీ సాధ్యపడటం లేదు. మంచి దర్శకుడే కానీ రికార్డులు బద్దలు కొట్టేంత భారీ ట్రాక్ రికార్డు లేని క్రిష్ హరిహరవీరమల్లుని చెక్కుతూనే ఉన్నారు. ఒక మీడియం రేంజ్ సినిమా ఒక ప్యాన్ ఇండియా డిజాస్టర్ ఇచ్చిన సుజిత్ ని కేవలం పోస్టర్ తో అతిగా ఊహించుకోకూడదు. హరీష్ శంకర్ దశాబ్దం క్రితం జోష్ చూపిస్తారా అంటే ఏమో. అసలే భవదీయుడు భగత్ సింగ్ కథ మారిందనే టాక్ జోరుగా ఉంది. సముతిరఖనితో వినోదయ సితం రీమేక్ క్యాన్సిలని ఎక్కడా రాలేదు. పోనీ ఉంటుందని అఫీషియల్ గా సదరు టీమూ చెప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో ఏడాదిన్నరలో ఎన్నికలు పెట్టుకుని ఇంత ఒత్తిడి మధ్య నిజంగా పవన్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చే దర్శకుడు వీళ్ళలో ఉన్నాడా