Kotla Jayasurya Prakasha Reddy TDPమాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడం ఆలస్యం అవ్వడం, మీడియా ముందు ఆయన టీడీపీలో చేరుతున్నా అని ఖచ్చితంగా చెప్పకపోవడంతో బేరం కుదరలేదని, ఆయన బహుశా వైఎస్సాఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇది నిజం కాదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కోట్ల రాక అంత తేలికైన విషయం కాదని దానికంటే ముందు పార్టీలో ఆయనను వ్యతిరేకించే వర్గాలతో మాట్లాడి ఆయన రాకకు మార్గం సుగమం చేస్తున్నారు.

కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబం తెదేపాలోకి వచ్చినా… పత్తికొండ, డోన్‌ టికెట్‌లు తమకే కేటాయించాలని పట్టుబడుతున్న ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి.. తన సోదరులు, కుమారుడితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి మాట్లాడారు. టికెట్ల్ల విషయంలో వారికి ముఖ్యమంత్రి నుంచి ఇతమిత్థమైన హామీ ఏదీ రాలేదని తెలుస్తుంది. పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఎవరు వచ్చినా ఆహ్వానించాలని, కోట్ల కుటుంబంతో కలసి పనిచేయాలని కేఈ సోదరులకు ఆయన సూచించారట.

కొన్ని కొన్ని సర్దుబాట్లు తప్పవని వారికి డైరెక్టుగానే చెప్పేశారట. సూర్యప్రకాష్‌రెడ్డి కర్నూలు లోక్‌సభ స్థానం ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఆయన సతీమణి డోన్‌ స్థానం ఆశిస్తున్నారు. కేఈ కుటుంబం మాత్రం దీనిని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. దీనిపై చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటే కోట్ల టీడీపీలోకి రావడం దాదాపుగా ఖాయం అయిపోయినట్టే. కేఈ కుటుంబం ఒప్పుకోక పోయినా కోట్ల రావడం ఖాయమే అంటున్నాయి టీడీపీ వర్గాలు. కొంత ఆలస్యమైనా ఖచ్చితమైన హామీ లభించాక కోట్ల టీడీపీలో చేరతారని సమాచారం.