Kothapalli_Subbarayudu_Suspensionమాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ప్రవర్తిస్తునందుకు, సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ బుధవారం ప్రకటించింది. ఇది ఊహించిందే అయినప్పటికీ కొత్తపల్లి ఓ ధర్మసందేహం వ్యక్తం చేశారు.

ఈరోజు ఉదయం నరసాపురంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “నేను ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. వ్యవహరించలేదు. కానీ కనీసం నన్ను సంజాయిషీ కోరకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నేను పశ్చిమగోదావరి ప్రజల అభీష్టం మేరకు నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని అడిగాను. కానీ అది కూడా ప్రభుత్వానికి పెద్ద తప్పుగానే కనబడింది.

నాపై పోలీస్ కేసు నమోదు చేసి దానిలో నన్ను ఎ-1 ముద్దాయిగా పేర్కొనడం నాకు చాలా బాధ కలిగించింది. ప్రభుత్వం నా గన్‌మెన్‌లను తొలగించింది. కానీ నేను ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. అయినా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నన్ను పార్టీలో నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో ఈరోజు సాయంత్రంలోకా చెప్పాలని పార్టీ పెద్దలని కోరుతున్నాను.

నేను పార్టీ, ప్రభుత్వం పట్ల ఎంతో విధేయంగా ఉన్నప్పటికీ నన్ను పార్టీ నుంచి తొలగించారు. కానీ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు నిత్యం సిఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ, ప్రభుత్వంపై కేసులు వేస్తునే ఉన్నారు. కానీ ఆయనపై పార్టీ ఇంతవరకు ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు? ఆయనను ఇంకా పార్టీలోనే ఎందుకు కొనసాగిస్తున్నారు?” అని కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు వైసిపీ ఏమి సమాధానం చెపుతుందో ఎదురుచూడాలి కానీ ఆయనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో ఆయనకి కూడా బాగా తెలుసు. పార్టీ పెద్దలకు సన్నిహితంగా మెలిగే నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు వలన తనకు అన్యాయం జరుగుతోందని కొత్తపల్లి భావిస్తున్నారు. కనుక నియోజకవర్గంలో ఆయనపై రాజకీయంగా పైచేయి సాధించడానికి నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ఉద్యమం మొదలుపెట్టి, ఆయనను విమర్శించడం మొదలుపెట్టారు.

కొత్త జిల్లాల ఏర్పాటుతో అప్పటికే వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి చాలా తలనొప్పులు ఎదుర్కొంటోంది. సరిగ్గా అదే సమయంలో కొత్తపల్లి కూడా ఉద్యమం ప్రారంభించడంతో సహజంగానే సిఎం జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహం కలిగింది.

ఇదీగాక కొత్తపల్లి సుబ్బారాయుడు మొన్న మీడియాతో మాట్లాడుతూ “ఒకవేళ వచ్చే ఎన్నికలలో నాకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే నరసాపురం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతానని హెచ్చరించారు కూడా. అందుకే పార్టీలో నుంచి తనను బయటకు సాగనంపారని ఆయనకు కూడా తెలుసు.

అయన వైసీపీ నుంచి బయటకు వచ్చేసినట్లే కనుక మళ్ళీ టిడిపి గూటికి చేరుకొంటారా? అందుకు నరసాపురం నియోజకవర్గం నుంచి టిడిపీలో టికెట్ ఆశిస్తున్నవారు ఒప్పుకుంటారా? ఒకవేళ టిడిపి తలుపులు తెరవకపోతే జనసేన, బిజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలలో దేనిలోనైనా చేరుతారా లేదా స్వతంత్ర అభ్యర్ధిగానే బరిలో దిగుతారా? అనే ప్రశ్నలకు త్వరలో ఆయనే ఎలాగూ సమాధానం చెపుతారు. కనుక అంతవరకు వేచి చూద్దాం.