Kothapalli Subbarayudu ఎమ్మెల్యే హోదాలో ఉన్న వారే కాదు, పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు కూడా వైఎస్సార్సీపీకి ‘టాటా’ చెప్పేస్తున్న వైనం పార్టీ వర్గాలను తీవ్ర నిరాశలోకి నెట్టేస్తోంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో భారీ ఎదురు దెబ్బకు రంగం సిద్ధమైనట్లుగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా సాధించలేకపోయినా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి బలమైన నేతలు పార్టీకి అండగా ఉన్నారు.

అయితే ఆ కీలక నేత కూడా వైసీపీని వీడబోతున్నారనే సమాచారం పార్టీ దుస్థితిని చాటి చెప్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి కాపు సామాజిక వర్గపు నేత కొత్తపల్లి సుబ్బారాయుడు, టిడిపిలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సన్నద్ధమయ్యాయని తెలుస్తోంది.

అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ ఏర్పాటు చేసిన సమయంలో టిడిపి నుండి జంప్ అయిన కొత్తపల్లి, ‘ప్రజారాజ్యం’ కాంగ్రెస్ లో విలీనం తర్వాత వైసీపీలో చేరిపోయారు. గడచిన ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతో ఓటమి పాలైన కొత్తపల్లి, ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడి హోదాలో కొనసాగుతున్నారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో సొంత పార్టీలో చేరేందుకు కొత్తపల్లి చేస్తున్న యత్నాలు సాగిస్తున్నారు.

ఇందులో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్వయంగా కొత్తపల్లికి ఫోన్ చేసి, పార్టీలోకి రావాలని ఆహ్వానం పలకడం విశేషం. దీంతో సుబ్బారాయుడు త్వరలోనే పసుపు కండువా కప్పుకునే రోజు దగ్గర పడిందని స్థానికంగా వ్యక్తమవుతున్న సమాచారం. తాను కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళుతున్నానని, తిరిగి వచ్చిన తర్వాత కలుద్దామని చంద్రబాబు చెప్పడంతో, మంచి ముహూర్తం చూసుకుని పార్టీలో చేరతానని కొత్తపల్లి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.