Kothapalli Subbarayudu again joinging TDP        మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు సాగనంపేందుకు పొగ పెడుతోందా? అంటే అవుననే అనిపిస్తుంది. ఇటీవల జిల్లాల పునర్విభజన చేస్తున్నప్పుడు ఆయన నర్సాపురం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేయాలని ఉద్యమం నడిపించారు.

ఈ సందర్భంగా నర్సాపురంలో జరిగిన ఓ సభలో ఆయన చెప్పుతో కొట్టుకొని ప్రభుత్వానికి నిరసన కూడా తెలిపారు. అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడమే కాక నర్సాపురం వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజుపై బహిరంగంగా విమర్శించడాన్ని సిఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దానిలో ఆయనను ఏ-1 నిందితుడిగా పేర్కొన్నారు. ఆ తరువాత ప్రభుత్వం ఆయనకు గన్‌మెన్‌లను తొలగించింది. పార్టీ క్రమశిక్షణ అతిక్రమించి వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు కూడా. కనుక వైసీపీలో కొత్తపల్లికి పొగ పెట్టడం మొదలైందని స్పష్టమవుతోంది.

ఈ పరిస్థితులలో ఆయన నిన్న తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “గత ఎన్నికలలో ప్రసాదరాజుని నర్సాపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు మద్దతు ఇచ్చి పెద్ద పొరపాటు చేశాను. ఆయన స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ నర్సాపురం జిల్లా కేంద్రంగా చేయాలనే నా పోరాటంలో కలిసి రాలేదు. కనీసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదు. వచ్చే ఎన్నికలలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో నాకు తెలీదు. కానీ నేను మాత్రం నర్సాపురం నుంచే పోటీ చేయబోతున్నాను. ఒకవేళ పార్టీ నాకు టికెట్ ఇస్తే సరేసరి లేకుంటే స్వతంత్ర అభ్యర్ధిగానైనా పోటీ చేస్తాను,” అని కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు.

పార్టీ అధిష్టానం తనపై ఆగ్రహంగా ఉందని తెలిసి కొత్తపల్లి ఈవిదంగా మాట్లాడతామంటే పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్లే భావించవచ్చు. వైసీపీ కూడా అదే ఆలోచనలో ఉంది కనుక త్వరలోనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించవచ్చు.

అదే జరిగితే ఆయన మళ్ళీ తెలుగుదేశం గూటికే చేరుకొనే అవకాశం ఉంది. ఇటీవల బాదుడే…బాదుడు, మహానాడు కార్యక్రమాలతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది గనుక కొత్తపల్లి వంటి పలువురు నేతలు టిడిపివైపు చూస్తుండటంలో ఆశ్చర్యమేమీ లేదు. మరి ఆయన తిరిగి రావాలనుకొంటే టిడిపి ఆయనను చేర్చుకొంటుందా లేదో?