Kotamreddy_Sridhar_Reddy_Vs_YSRCPవైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వైస్సార్ కుటుంబంతో మూడు తరాల అనుబందం ఉంది. అటువంటిది తననే సిఎం జగన్మోహన్ రెడ్డి అనుమానించారని, తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించి ఇంటలిజన్స్ చీఫ్ చేత బెదిరించారని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఆరోపించారు. ఆయన తీవ్ర ఆవేదనతో పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.

వైస్సార్ కుటుంబంతో మూడు తరాల అనుబందం ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హటాత్తుగా టిడిపిలో చేరాల్సిన అవసరం ఏమోచ్చింది? అని ప్రశ్నించుకొంటే వైసీపీలోనే ఏదో లోపం ఉన్నట్లు అర్దమవుతోంది. మరికాస్త ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే, సిఎం జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కూడా బయటకువెళ్ళిపోవడం అందరికీ తెలుసు. కనుక వారికే ఈ పరిస్థితి ఎదురైనప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎదురైన చేదు అనుభవాలు ఎంత… అనిపిస్తాయి. కానీ వైసీపీలో ఎటువంటి రాజకీయ వాతావరణం నెలకొని ఉందో ఆయన నిన్న తెలియజేశారనుకోవచ్చు.

ఏ రాజకీయ పార్టీలోనైనా అప్పుడప్పుడు ఇటువంటి అనూహ్యమైన పరిణామాలు జరుగుతుంటాయి కనుక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలని, భవిష్య కార్యాచరణని పక్కన పెట్టి చూస్తే, ఇంతకాలం మనోడే అంటూ ఆయనతో భుజాలు రాసుకొని తిరిగిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ రెడ్డి వంటివారు అప్పుడే ఆయనపై మూకుమ్మడిగా దాడి చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఎన్నికలకి ఇంకా 15 నెలల సమయం ఉండగా తాను పార్టీ నుంచి బయటకు వెళితే ఎటువంటి విపరీత పరిణామాలు, రాజకీయ కక్ష సాధింపులు ఎదుర్కోవలసి వస్తుందో తనకి బాగా తెలుసని, అయినా పార్టీలో ఉండలేక వెళ్ళిపోతున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పిన మాటలని కూడా తేలికగా కొట్టిపడేయలేము. అంటే వైసీపీలో ఉంటూ తమ అధినేతని వెనకేసుకొస్తూ, ప్రతిపక్ష నేతలపై ఎదురుదాడి చేస్తున్నవారిలో ఎవరు బయటకి వెళ్ళినా వారికీ ఇదేవిదంగా ట్రీట్‌మెంట్‌ జరుగుతుందని స్పష్టమవుతోంది.

వైసీపీ కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్‌ జరుగుతోందని, ఆ విషయం వారికి కూడా తెలుసని తనకు చెప్పారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలని తేలికగా కొట్టిపడేయలేము. వైస్సార్ కుటుంబంతో మూడు తరాల అనుబందం ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే ఈ పరిస్థితి ఉన్నప్పుడు మిగిలిన నేతలకి మినహాయింపు ఉంటుందనుకోవడం రాజకీయ అజ్ఞానమే అవుతుంది.

కనుక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిన్న చెప్పిన్నట్లు ఇటువంటి సమస్యలని చేజేతులా కొనితెచ్చుకోవడం ఎందుకని వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు ఎన్నికల గంట మ్రోగేవరకు ఎదురుచూసి గోడ దూకేయవచ్చు. వైసీపీలో అంతర్గతంగా ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు వచ్చే ఎన్నికలలో 175 సీట్లు గెలుస్తామని జగనన్న నమ్మకంగా ఏవిదంగా చెపుతున్నారో?