Kotamreddy_Sridhar_Reddy_Telephone_Tapping_Press_Meetనెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు ఉదయం నెల్లూరులో ప్రెస్‌మీట్‌ పెట్టి, తమ వైసీపీ ప్రభుత్వమే తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తోందని ఆరోపిస్తూ సాక్ష్యాధారాలని బయటపెట్టారు. నియోజకవర్గంలోని వివిద సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయని ఆవేదన చెందుతూ తాను స్నేహితుడితో మాట్లాడిన మాటలని ప్రభుత్వ పెద్దలు రహస్యంగా వింటున్నారని ఆరోపించారు.

సుమారు 20 రోజుల క్రితం ఈ విషయం ఏపీ ఇంటలిజన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు నాకు ఫోన్‌ చేసి “మీరంటే సిఎం జగన్‌గారికి చాలా అభిమానం. ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నావు?” అంటూ హెచ్చరించారు. మా ఇరువురి సంభాషణనని ఆయన ఫోన్‌ నంబర్: 9849966000 నుంచి నాకు పంపించారు. ఇదిగో ఆయన నెంబర్ అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా మిత్రులకి దానిని చూపించి, ఆయన పంపిన కాల్ రికార్డుని విలేఖరులకి వినిపించారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “వైఎస్ కుటుంబంలో మూడు తరాలతో నాకు అనుబందం ఉంది. వారితో కలిసి పనిచేశాను. అటువంటి నామీద సిఎం జగన్మోహన్ రెడ్డికి అనుమానం కలిగిందని, నా ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తున్నారని తెలిసినప్పుడు మొదట నేనూ నమ్మలేకపోయాను. కానీ ఇంటలిజన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు నన్ను హెచ్చరించి, కాల్ రికార్డింగ్ పంపిన తర్వాత నమ్మాల్సివచ్చింది. ఆ మాటలు నావే… అందులో మాట్లాడింది నేనే. ఆ గొంతు నాదే.

నన్ను అనుమానిస్తున్నప్పుడు, నాపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదని తెలిసినప్పుడు నేను ఇంకా నటిస్తూ పార్టీలో కొనసాగలేనని భావించి మౌనంగా నిష్క్రమించాలనుకొన్నాను. కానీ ప్రభుత్వం నన్ను నలుగురిలో దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు నా వ్యక్తిత్వాన్ని కాపాడుకొనేందుకే నేను ఇలా మీడియా ముందుకు వచ్చాను తప్ప వేరే ఉద్దేశ్యం లేదు.

నాకు నటించడం చేతకాదు కనుకనే ఇంకా 15 నెలల సమయం ఉండగానే పార్టీని వీడి బయటకి వెళుతున్నాను. లేకుంటే చివరి వరకు ఉంది పదవి అధికారం అనుభవించి బయటకు వెళ్ళి ఉండేవాడిని కదా? ఇప్పుడు బయటకి వెళ్ళడం వలన ఎదురయ్యే పరిణామాలు, పర్యవసానాలు అన్ని నాకు తెలుసు. వాటికి సిద్దపడే నేను బయటకు వెళుతున్నాను.

అసలు ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తే ఆ విషయం ఇంటలిజన్స్ చీఫ్ ముందుగా ముఖ్యమంత్రికొ లేదా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికో చెప్పాలి కానీ నాకు ఎందుకు ఫోన్‌ చేసి చెప్పారు? ప్రభుత్వం అధికారులందరూ ముఖ్యమంత్రి ఆదేశంతోనే పనిచేస్తుంటారు. కనుక ముఖ్యమంత్రి ఆదేశంతోనే ఆయన నాకు ఫోన్‌ చేసి చెప్పారు. అంటే నా గురించి అన్ని విషయాలు మాకు తెలుసని బెదిరించడమే కదా?

నా ఫోన్‌ని ఎవరూ ట్యాపింగ్‌ చేయలేదని మీరంటున్నారు. కానీ చేశారని నేను అంటున్నాను. ట్యాపింగ్ చేసినవారు మేము దొంగచాటుగా సంభాషణ వింటున్నామని ఒప్పుకొంటారా చెప్పుకొంటారా?ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా? కనుక ఫోన్‌ ట్యాపింగ్ చేయలేదని నిరూపించండి.

ఇప్పుడు ఈ సమావేశంలో ఫోన్‌ ట్యాపింగ్‌ గురించి మాత్రమే మాట్లాడుతాను లేకుంటే అసలు విషయం పక్కదారి పట్టే ప్రయత్నం చేయవచ్చు. ఫోన్‌ ట్యాపింగ్‌ నా ఒక్కడితోనే సరిపెట్టిందనుకోవడానికి లేదు. నేను ఈ వ్యవహారం గురించి బయటపెట్టిన తర్వాత ఇద్దరు మంత్రులు, నలుగురు ఎంపీలు, సుమారు 30 మంది ఎమ్మెల్యేలు నాకు ఫోన్లు చేసి తమ ఫోన్లు కూడా ట్యాపింగ్‌ జరుగుతున్న విషయం తమకి తెలుసని కానీ ధైర్యంగా బయటపడి మాట్లాడలేమని నిసహాయత వ్యక్తం చేశారు.

సొంత పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల ఫోన్లే ట్యాపింగ్‌ చేస్తున్నప్పుడు, హైకోర్టు జడ్జీలు, ప్రతిపక్ష నేతలు, మీడియా సంస్థల అధినేతలు, విలేఖరుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌ చేయదనే నమ్మకం ఏంటీ?నేను ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తాను.

నేను బెస్ట్ ఎమ్మెల్యేనయితే నాతో ఎందుకు ఇలా వ్యవహరించారనే ప్రశ్నకి సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి… నేను కాదు,” అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.