Kotamreddy_Sridhar_Reddy_Sajjala_Ramakrishna_Reddyఓ రాజకీయ నాయకుడు ఓ పార్టీలో ఉన్నప్పుడు ‘అహా… ఓహో..’ అని అధినేతని, పార్టీని పొగుతుంటాడు ఎందుకంటే తప్పదు గాబట్టి. కానీ ఆ నాయకుడే పార్టీ వీడిన తర్వాత మాట్లాడే మాటల్లో కాస్త అతిశయోక్తి ఉన్నప్పటికీ అవే అసలైనవని భావించవచ్చు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు పార్టీలో నుంచి బయటకి వచ్చేశారు. కనుక ఆయన తమ అధినేత, పార్టీ, ప్రభుత్వం, దానిలో పనిచేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారి గురించి చెపుతున్న మాటలు వింటే వైసీపీ ప్రభుత్వం గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు నిజమే అని అర్దమవుతుంది. ఈరోజు ఆయన నెల్లూరులో ప్రెస్‌మీట్‌ పెట్టి చాలా విషయాలు చెప్పారు. ఆయన ఏమన్నారో క్లుప్తంగా…

·మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్ని ఉద్దేశ్యించి, “తమ్ముడూ నీకు కార్పొరేటర్ టికెట్‌ ఇప్పించిన ఆనం వివేకానంద రెడ్డినే ఇంటికి వెళ్ళి కొడతానని బెదిరించావు. నీకంటే రాజకీయాలలో నేను చాలా సీనియర్ అయినప్పటికీ నీ రాజకీయ ఎదుగుదలకి నేను ఎల్లప్పుడూ తోడ్పడ్డాను. కానీ నేను, నా భార్య, పిల్లలు నాశనం అయిపోవాలని నువ్వు కోరుకొంటున్నావు.

·సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత మేధావి అంటే ఆయన జగన్‌కి కాదు… అమెరికా అధ్యక్షుడుకి సలఘాదారుగా ఉండాల్సిన వ్యక్తి.

·నేను నెల్లూరులో సినిమా థియేటర్ల నుంచి నెలకి రూ.2 లక్షలు వసూలు చేస్తుంటానని, నా అరెస్టుకి రంగం సిద్దం అవుతోందని, మీడియాకి లీకులు ఇస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రమే ఇలాంటి చవుకబారు ఐడియాలు వస్తాయని పార్టీలో అందరికీ తెలుసు.

·కరోనాతో తీవ్రంగా నష్టపోయిన థియేటర్ల యజమానులు మొత్తుకొంటుంటే వారి నుంచి నేను నెలకి రెండు లక్షలు ఎలా వసూలు చేయగలను? అసలు మన ప్రభుత్వం అధికారంలో వచ్చాక థియేటర్ల యజమానులు వాటిని నడిపించలేక షాపింగ్ మాల్స్ లేదా కళ్యాణ మండపాలుగా మార్చేసుకొంటామని మొత్తుకొంటున్నారు కదా సజ్జలగారు?

·నన్ను అరెస్ట్ చేస్తారా?రండి ఇప్పుడే చేసుకోండి. నేను సిద్దంగా ఉన్నాను. మీ ఉడత బెదిరింపులకి నేను భయపడేవాడిని కాను. జైల్లో పెట్టినా నా గొంతు వినిపిస్తూనే ఉంటుంది. కనుక నన్ను ఎన్‌కౌంటర్ చేయించేయండి. అప్పుడు సైలెంట్ అయిపోతుంది.

·సజ్జల రామకృష్ణారెడ్డిగారు… మీకు దైర్యం ఉంటే మన పార్టీలో, ప్రభుత్వంలో ఇసుక, మద్యం మాఫియా చేస్తున్న వారి గురించి మాట్లాడండి. వారు దోచుకొంటున్న ఆ డబ్బంతా ఎక్కడికి వెళుతుందో చెప్పండి. మన ప్రభుత్వంలో ఇసుక, మద్యం గురించి ప్రజలకి కూడా తెలుసు కనుక వారు తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకొంటారు. కానీ ఈ మాఫియాసురుల గురించి మాట్లాడిన మరుక్షణం మీ సలహాదారు పదవి ఊడిపోవడం ఖాయం.

·గత ఏడాది డిసెంబర్‌ 25న నేను బెంజికారులో వెళ్ళి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లని కలిసిన్నట్లు సాక్షి మీడియాలో కట్టుకధ ప్రచురించేసింది. అయితే ఆ రోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఉదయం 8 నుంచి రాత్రి పొద్దుపోయేవరకు నేను, నా అనుచరులతో కలిసి నెల్లూరులో అన్ని చర్చిలకి తిరుగుతూ పెద్ద ఎత్తున సామాజిక సేవాకార్యక్రమాలు చేపట్టాము. ఆ విషయం సాక్షి మీడియాలో కూడా వచ్చి ఉండాలే?అప్పుడే మరిచిపోతే ఎలా?

·నేను పార్టీలో నుంచి తప్పుకొన్నాను కనుక నా స్థానంలో వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించిన్నట్లు విన్నాను. ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సీఏవో నా మీద చాలా కక్షతో ఉంది. కనుక నియోజకవర్గంలో మీరు చెప్పిన ప్రతీ పని శరవేగంగా చేయించేందుకు సిద్దంగా ఉంటుంది. కనుక మీరు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఇంతకాలంగా నియోజకవర్గంలో నేను పూర్తిచేయలేకపోయిన పనులన్నిటినీ పూర్తిచేసి ఆ క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి. మీకు నా సహకారం అవసరం ఉండకపోవచ్చు కానీ స్థానిక ఎమ్మెల్యేగా నావంతు సహాయసహకారాలు అందించేందుకు నేను సిద్దంగా ఉన్నాను. ఎవరు ఇన్‌ఛార్జ్‌ అయినా నియోజకవర్గంలో సమస్యలని పరిష్కరించి అభివృద్ధి చేయడమే ముఖ్యం.

·ఇప్పుడు నేను రాజీనామా చేసినా వెంటనే ఎన్నికలు జరుగవు. ఆర్నెల్లో ఏడాది తర్వాతో జరుగుతాయి. కనుక ఇప్పుడు నేను నా పదవికి రాజీనామా చేయడం లేదు.