Kotamreddy-Sridhar-Reddyఏపీ ప్రభుత్వం వృద్ధాప్య, ఒంటరి మహిళ, వికలాంగుల పింఛన్లను తొలగిస్తుండటాన్ని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన ఈరోజు నెల్లూరులో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “రెండు మూడు రోజులుగా నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. అనేకమంది స్వయంగా నా వద్దకి వచ్చి ప్రభుత్వం తమ పింఛన్లను రద్దు చేస్తోందని ఫిర్యాదు చేస్తున్నారు. నా నియోజకవర్గంలోనే సుమారు 2-3,000 మందికి పింఛన్లు తొలగిస్తున్నట్లు మా పార్టీ కార్యకర్తల ద్వారా తెలుసుకొన్నాను. ఇది చాలా బాధాకరం. ఒక వృద్ధురాలు తాను రూ. 200 పింఛన్ ఉన్నప్పటి నుంచి తీసుకొంటున్నానని, కానీ ఇప్పుడు పింఛన్ పెరిగిన తర్వాత తన పేరు తొలగిస్తున్నారని వాలంటీర్ వచ్చి చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు.

నేను వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి దీనిపై మళ్ళీ సర్వే నిర్వహించమని అడిగాను. నన్ను కలిసినా కలవకపోయినా నా నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛను అందాలని, ఏ ఒక్కరికీ తొలగించకూడదని నేను గట్టిగా కోరుకొంటున్నాను. ఎందుకంటే చాలా మందికి ఈ పింఛన్లే ఆధారం. వారికి వేరే ఆదాయం లేదు. కనుక మీడియాలో ఈ పింఛన్ల తొలగింపు కార్యక్రమం గురించి వస్తున్న వార్తలు నిజం కాకూడదని నేను కోరుకొంటున్నాను,” అని అన్నారు.

సంక్షేమ పధకాల భారంతో క్రుంగిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం బహుశః ఆ ఆర్ధిక భారం తగ్గించుకొనేందుకు హటాత్తుగా సుమారు 1.60 లక్షల మంది పాత పింఛనుదారులకు నిబందనల పేరుతో పింఛన్ నిలిపివేసేందుకు నోటీసులు పంపిస్తోంది. ఇప్పటికే గడప గడపకి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొంటుండటంతో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి భయపడుతున్నారు. ఇప్పుడు ఈ పింఛన్లు నిలిపివేస్తే ప్రజలకు మొహం చూపించలేని పరిస్థితి ఏర్పడుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వైసీపీ నేతలు భయపడుతున్నారు.