Kotamreddy_Sridhar_Reddy_Nelloreగత ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో టిడిపిని తుడిచిపెట్టేసి వైసీపీ చేజిక్కించుకొంది. అప్పటి నుంచి నెల్లూరు వైసీపీకి కంచుకోటగా మారింది. అయితే ఇప్పుడు ఆ కంచుకోటకే మంటలు అంటుకోవడంతో వైసీపీ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓ పక్క వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తమ ప్రభుత్వం, పార్టీ పనితీరుపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ‘తమ ప్రభుత్వమే తన ఫోన్‌ ట్యాపింగ్ చేయిస్తోందని’ తీవ్ర ఆరోపణలు చేస్తూ వైసీపీకి గుడ్ బై చెప్పేసి టిడిపిలో చేరిపోతునట్లు ప్రకటించేశారు.

తనకి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయం నుంచే వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ పార్టీలో పనిచేస్తున్న తాను మంత్రి పదవికి అన్ని విదాల అర్హుడినని చెప్పారు. మొదటిసారి ఇవ్వకపోయినా తాను జగన్‌పై నమ్మకంతో జిల్లా మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌కి అన్ని విదాలా సహకరించానని, కానీ రెండోసారి మంత్రివర్గం ప్రక్షాళన చేసినప్పుడు కూడా తనకి మంత్రి పదవి ఇవ్వకపోవడం జీర్ణించుకోలేకపోతున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అవమానం సరిపోదన్నట్లు ప్రభుత్వం తనని అనుమానిస్తూ తన ఫోన్‌ ట్యాపింగ్ చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తన సోదరుడు గిరిధర్ రెడ్డికి వైసీపీ టికెట్‌ ఇచ్చి అన్నదమ్ముల మద్య చిచ్చుపెట్టేందుకు కూడా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇన్ని అవమానాలు భరిస్తూ, నమ్మకం లేని చోట పనిచేయలేనని చెపుతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికలలో టిడిపి తరపున పోటీ చేస్తానని ప్రకటించేశారు. అంతే కాదు… తన నెల్లూరు రూరల్ కార్యాలయం ఎదుట సిఎం జగన్మోహన్ రెడ్డితో ఉన్న వైసీపీ ఫ్లెక్సీ బ్యానర్ తొలగించి, దాని స్థానంలో తమ అన్నదమ్ముల ఫ్లెక్సీ బ్యానర్ పెట్టించేశారు.

నెల్లూరు వైసీపీ కంచుకోటలో మంటలు ఆర్పడానికి మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్‌ యాదవ్ తదితరులు ప్రయత్నించారు. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శాంతించలేదు. నిన్న ఉదయం ఈ వ్యవహారం ‘టీకప్పులో తుఫాను మాత్రమే’ అని చెప్పిన బాలినేని, అది నిజమైన తుఫానే అని అర్దం అయిన తర్వాత సాయంత్రం మాట మార్చి “శ్రీధర్ రెడ్డి టిడిపితో ముందుగా అన్నీ మాట్లాడుకొని పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకొని ప్రభుత్వంపై ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఫోన్‌ని ఎవరూ ట్యాపింగ్ చేయలేదు. ఆయనే తన వద్ద ఉన్న కాల్ రికార్డింగ్‌ని అందరికీ వినిపిస్తూ అదే ఫోన్‌ ట్యాపింగ్‌ అని చెపుకొంటున్నారు. దమ్ముంటే ఫోన్‌ ట్యాపింగ్ చేసిన్నట్లు నిరూపించాలి,” అని సవాల్ విసిరారు.

బాలినేని అనాలోచితంగా విసిరిన ఈ సవాల్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పీకకి చుట్టుకొనేలా ఉంది. బాలినేని సవాలుని స్వీకరిస్తున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. బుదవారం ప్రెస్‌మీట్‌లో తన ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబందించి సాక్ష్యాధారాలను బయటపెడతానని చెప్పారు. ఇంతవరకు జగనన్న మీద విశ్వాసంతో వాటిని బయటపెడితే తమ ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు ఊడిపోతాయని ఆగానని కానీ ఇప్పుడు బాలినేని సవాలు విసురుతున్నారు కనుక తప్పకుండా బయట పెడతానని, ఆ తర్వాత జరుగబోయే పరిణామాలకు వైసీపీ ప్రభుత్వం సిద్దంగా ఉండాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.

కనుక నెల్లూరు వైసీపీ కంచుకోటలో అంటుకొన్న మంటలని ఆర్పే ప్రయత్నంలో వైసీపీ నేతలు వాటిని మరింత రాజేసిన్నట్లయింది. కనుక అవి అక్కడితో ఆగుతాయా… కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం బయటపెట్టాక ఆ మంటలు అన్ని జిల్లాలకి వ్యాపిస్తాయా?వైఎస్సార్ కుటుంబంతో దశాబ్ధాలుగా అనుబందం ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపైనే నిఘా పెట్టడం నిజమైతే ఇతర పార్టీల గోడల దూకి వైసీపీలో చేరినవారికి మినహాయింపు ఉంటుందా?

Kotamreddy-Sridhar-Reddy-Flexi