నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ ప్రభుత్వమే తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ఆరోపిస్తూ రెండు నెలల క్రితం పార్టీకి గుడ్ బై చెప్పేసి బయటకి వచ్చేశారు. మొదట్లో ఆయన ప్రెస్‌మీట్‌లు పెట్టి తమ ప్రభుత్వం, దానిలో మంత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులపై సంచలన ఆరోపణలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. కానీ ఆ పద్దతిలో ఎక్కువ రోజులు ముందుకు సాగడం వలన ప్రయోజనం ఉండదని గ్రహించి ఆయన విన్నూత్నమైన మార్గంలో వైసీపీ ప్రభుత్వానికి సవాళ్ళు విసిరేందుకు సిద్దం అవుతున్నారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో పేరుకుపోయిన అనేక సమస్యల పరిష్కారం కోసం గట్టిగా ప్రయత్నించారు. వాటిలో కొన్నిటికి గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు నిధులు విడుదలచేయలేదు.
కనుక ఇప్పుడు వాటి గురించి గట్టిగా నిలదీసేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సిద్దం అవుతున్నారు. అయితే మళ్ళీ వాటికోసం ప్రెస్‌మీట్‌లతో కాలక్షేపం చేయకుండా, నేరుగా క్షేత్రస్థాయిలోనే దీక్షలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించుకొన్నారు. తద్వారా ప్రజా సమస్యల కోసం ఆయన పోరాడుతున్నట్లు అవుతుంది కనుక ప్రజలను తనవైపు తిప్పుకోగలుగుతారు. అదే సమయంలో వాటిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విషయం తన నియోజకవర్గంలో ప్రజలకు చాటిచెప్పిన్నట్లవుతుంది.
ముందుగా తన నియోజకవర్గం పరిధిలోని పొట్టేపాలెం కలుజువద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం ఏప్రిల్ 1వ తేదీన జలదీక్ష చేయబోతున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. పెన్నా వరదల సమయంలో సిఎం జగన్మోహన్ రెడ్డిని అక్కడికి తీసుకువచ్చి చూపించగా తక్షణం నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయాయలేదు. బ్రిడ్జి నిర్మాణం జరుగకపోవడం స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేకసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. కనుక తక్షణం ఈ బ్రిడ్జి నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
అయితే సంక్షేమ పధకాలు, అప్పులు, ఈ నెలాఖరులోగా ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.3,000 కోట్ల బకాయిల కారణంగా ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉంది. కనుక ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. కేటాయించకపోతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఊరుకోరు. ప్రభుత్వ వైఫల్యంగా చూపుతారు.
ఒకవేళ ఏదోలా సర్దుబాటు చేసి నిధులు కేటాయించినా ఆ క్రెడిట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే దక్కుతుంది తప్ప నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా బరిలో దిగబోతున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి దక్కదు. ఒకవేళ దీనికి నిధులు కేటాయిస్తే మరోదాని కోసం ఆయన పోరాటం మొదలుపెట్టవచ్చు. కానీ ఇటువంటి పరీక్షల నుంచి ఏవిదంగా తప్పించుకోవాలో వైసీపీకి తెలిసిన్నట్లు మరే పార్టీకి తెలియదు. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించి, ఆదాల ప్రభాకర్ రెడ్డి చేత శంకుస్థాపన చేయించి శిలాఫలకంతో సరిపెట్టవచ్చు. లేదా టెండర్ల ప్రక్రియని ఎన్నికల వరకు సాగదీసుకుపోయే వెసులుబాటు కూడా ఉంది.