Kotamreddy_Sridhar_Reddy_Assemblyఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుతో వేగుతున్న వైసీపీకి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి పక్కలో మరో బల్లెంలా మారారు. ఈరోజు శాసనసభ ప్రశ్నోత్తర సమయంలో తన నియోజకవర్గంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలంటూ పట్టుబట్టడంతో వైసీపీ మంత్రులు ఆయనకు ఎలా సర్దిచెప్పాలో తెలియక తలలు పట్టుకొన్నారు.

శాసనసభ సమావేశాలు అన్ని టీవీ న్యూస్ ఛానల్స్‌లో వస్తాయి. ఒకవేళ ఆయన రాజకీయ విమర్శలు చేస్తే వైసీపీ సభ్యులు ఆయనపై ఎదురుదాడి చేసి నోరు మూయించవచ్చు. కానీ ఆయన కేవలం తన నియోజకవర్గంలో సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో ఎదురుదాడి చేయలేకపోతున్నారు.

ఒకవేళ అలాచేస్తే ప్రజాసమస్యలని పరిష్కరించమని అడుగుతుంటే అధికార పార్టీ సభ్యులు ఆయన నోరు నొక్కేశారనే విషయం నియోజకవర్గంలోని ప్రజలందరూ గమనిస్తారు. కనుక స్పీకర్ తమ్మినేని సీతారాం కలుగజేసుకొని లిఖితపూర్వకంగా వాటిని తనకు సమర్పిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సమాధానం చెప్పిస్తానని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెనక్కు తగ్గకుండా సభలో నిరసన వ్యక్తం చేయసాగారు.

అప్పుడు మంత్రి అంబటి రాంబాబు లేచి చంద్రబాబు నాయుడు, అచ్చన్నాయుడు మెప్పుకోసం, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే డ్రామా ఆడుతున్నావని విమర్శించడంతో టిడిపి సభ్యులు కూడా లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభకు ఆటంకం కలిగిస్తున్నందున ఆయనపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని మంత్రి అంబటి రాంబాబు కోరగా, “నేను నా నియోజకవర్గంలో సమస్యలను శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, వాటిని పరిష్కరించమని అడగడం తప్పా? అందుకు నన్ను సస్పెండ్ చేస్తారా?” అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి అంబటి రాంబాబుని నిలదీశారు. తన నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు శాసనసభలో గాంధీజీ పద్దతిలో నిరసనలు తెలియజేస్తూనే ఉంటానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇంకా శాసనసభలో ఉండనిస్తే ఆయనకు వైసీపీ ప్రభుత్వమే ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చి, నియోజకవర్గంలో హీరోగా చేసిన్నట్లవుతుంది. కనుక సస్పెన్షన్ వేటు వేసి వదిలించుకోక తప్పదు.