kotamreddy-sridhar-reddy-arrestedజగన్ ముఖ్యమంత్రి అయ్యాకా అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరొందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎట్టకేలకు అరెస్టు అయ్యారు. వరుస వివాదాలలో ఇరుకున్న ఆయనను ఇప్పటివరకూ కాపాడుతూ వచ్చిన ముఖ్యమంత్రి, చివరికి ఒక మహిళా అధికారి ఇంటి మీదకు వెళ్లి దౌర్జన్యం చేసి రావడంతో ఈ ఇష్యూ ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఆయనను అరెస్టు చేయించారు.

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని, పోలీసులు తన కంప్లయింట్ ను తీసుకోవడం లేదని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి మీడియా కవరేజ్ బాగా రావడం, ప్రతిపక్షాలు కూడా తప్పు పట్టడంతో చేసేది ఏమీ లేక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

అయితే కారణం ఏదైనా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం మంచిదే. కేసును నిస్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే మిగతా ఎమ్మెల్యేలకు కూడా సరైన మెస్సేజ్ ఇచ్చినట్టు అవుతుంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. దీంతో కోటంరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న కోటంరెడ్డి అభిమానులు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.

అయితే సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. కుట్ర కోణాన్ని ఆరా తీయాలన్నారు. తాను తప్పు చేసినట్టు తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. తన తప్పేమీ లేదని, విచారణలో వాస్తవాలు తెలుస్తాయని కోటంరెడ్డి అన్నారు.