Kotamreddy Sridhar Reddy arrestవైఎస్సాఆర్ కాంగ్రెస్ కు చెందిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు ఈ ఉదయం అరెస్ట్‌ చేశారు. సర్వేల పేరుతో తమ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ కొందరి యువకులను చితకబాదారు స్థానిక వైఎస్సాఆర్ కాంగ్రెస్ నాయకులు. పోలీసులు విచారణలు వారు మాములుగా సర్వేలు చేసే వారే అని తేలడంతో వైకాపా కార్యకర్తల మీద కేసు పెట్టారు. అయితే గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో వేదాయపాళెం పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే హల్‌చల్‌ చేశారు.

తమ అనుచరులతో కలిసి చేరుకుని సీఐ నరసింహారావుతో వాగ్వాదానికి దిగారు. తమ అనుచరలను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఆ సమయంలో ఆయన మద్యం సేవించి ఉన్నారని వదంతులు ఉన్నాయి. దీనితో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కారణంతో ఆయనపై వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌లో నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన శ్రీధర్‌రెడ్డి నెల్లూరులోని స్థానిక వైఎస్సాఆర్ కాంగ్రెస్ కార్యాలయం వద్ద దీక్షకు దిగారు.

ఆయనను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీసులను ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అరెస్ట్‌కు నిరసనగా కార్యాలయం ముందు శ్రీధర్‌రెడ్డి భైఠాయించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఫైనల్ గా తాను పోలీసుల వాహనంలో రానని, నడిచే వస్తా అంటూ హై డ్రామా సృష్టించారు. ఎన్నికల సమయంలో ప్రజలలో సానుభూతి కోసం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డ్రామాలకు పాల్పడుతున్నారని స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నుండి కోటంరెడ్డి పై ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈసారి పోటీ చేయబోతున్నారని సమాచారం.