Kotamreddy _Sridhar_Reddy_Against_YSRCP_Illegal_Activitiesవైసీపీ ప్రభుత్వాన్ని, దాని పాలనను ప్రతిపక్షాలు విమర్శిస్తే వాటిని రాజకీయాలని కొట్టిపడెయవచ్చు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే తమ ప్రభుత్వం, పాలన గురించి చేస్తున్న విమర్శలను, ఆరోపణలను కొట్టిపడేయలేము కదా?

ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేసినందుకు వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. వారు నలుగురూ ఇంతకాలం వైసీపీకి, తమ అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డికి విధేయంగానే ఉండేవారని అందరికీ తెలుసు. కానీ పార్టీతో బంధం తెగిన తర్వాత వారు వైసీపీ వాస్తవరూపాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. వైసీపీలో అంతర్గతంగా ఏం జరుగుతోందో? వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో వారు బయటపెడుతున్నారు.

వారిలో నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. ఆయన ఎవరికీ భయపడే మనిషి కాదు. పార్టీలో ఉన్నప్పుడే తన నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించలేదని మురుగుకాలువలో నిలబడి ధర్నా చేసిన వ్యక్తి. తన నియోజకవర్గంలో కుంటిసాకులతో సామాజిక పింఛన్లు ఇవ్వకుండా ఎందుకు కత్తెరవేస్తున్నారని ధైర్యంగా ముఖ్యమంత్రిని అడిగినవ్యక్తి. ఈ కారణంగా వైసీపీ తనను అవమానిస్తూ, అనుమానించడం మొదలుపెట్టగానే, ఇంకా ఏడాదిన్నర ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ రెండు నెలల క్రితం ధైర్యంగా ప్రెస్‌మీట్‌ పెట్టి పార్టీకి గుడ్ బై చెప్పేసిన వ్యక్తి. అప్పటి నుంచి ఆయన వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నారు.

నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో రాజకీయ సునామీ రాబోతోంది. ఆ సునామీలో వైసీపీ కనబడకుండా కొట్టుకుపోవడం ఖాయం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ అరాచక పాలనతో వేసారిపోయున్నారు. కనుక ఎన్ని సంక్షేమ పధకాలు ఇస్తున్నా వచ్చే ఎన్నికలలో వైసీపీని గద్దె దించాలని ఇప్పటికే నిర్ణయించుకొన్నారు. రాష్ట్ర ప్రజలు భారీ మెజార్టీతో వైసీపీని గెలిపిస్తే కేవలం మూడున్నరేళ్ళలోనే ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకొంది. సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజలే కాదు… పట్టభద్రులు, చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మడం లేదని ఎమ్మెల్సీ ఎన్నికలలో రుజువైంది. ఇదే వైసీపీ పతనానికి ప్రారంభం. ఈసారి నెల్లూరు జిల్లాలో 10 స్థానాలలో వైసీపీ ఓటమి ఖాయం… జిల్లాలోనే కాదు… రాష్ట్ర వ్యాప్తంగా ఇవే ఫలితాలు వస్తాయి. వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం,” అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మేలు చేసేందుకు చాలా కృషి చేసినప్పటికీ, క్రమంగా ఇలాగే పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు మారుతూ చివరికి ఆయనను గద్దె దించేశాయి. మళ్ళీ ఇప్పుడూ అలాగే రాజకీయ పరివర్తనలు జరుగుతున్నాయి. కనుక ఈసారి టిడిపి ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ, ప్రభుత్వం, పాలనలో అవినీతి, దౌర్జన్యాల గురించి వైసీపీ ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్రశ్నలకు ఆ పార్టీ నేతలు ఎదురుదాడి చేసి, కేసులు పెట్టి నోళ్ళు మూయించే ప్రయత్నం చేయవచ్చు. కానీ మారుతున్న ఈ పరిస్థితులను వైసీపీలో ఎవరూ ఆపలేరు. చరిత్ర పునరావృతం కావడం తధ్యం.