KotamreddyGiridharReddy_Joining_TDPగురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్ద టపాసులు పేల్చి, మిటాయిలు పంచుకొని సంబరాలు చేసుకొన్నారు. వైసీపీ ఆరు సీట్లు గెలిచినందుకు కాదు… టిడిపి ఒక్క సీటు గెలిచినందుకు! ఆయన పార్టీ అధిష్టానంతో విభేదించి బయటకు వచ్చేసిన తర్వాత టిడిపిలో చేరాలనుకొంటున్నట్లు చెప్పారు. కానీ అందుకు తొందరేమీ లేదు కనుక వైసీపీలో ‘విభీషణడు’ పాత్ర పోషించి జగనన్నపై ప్రతీకారం తీర్చుకొన్నారు. బహుశః ఇందుకోసమే ఆయన రాజీనామాకు తొందరపడలేదేమో?ఇంకా వైసీపీలో చక్కదిద్దవలసిన కార్యక్రమాలు ఏవైనా ఉండిపోయాయేమో తెలీదు కనుక ఆయన వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగాలనుకొంటున్నారు.

కానీ ఆయనకు లక్ష్మణుడు వంటి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ఇటువంటి ప్రతిబంధకాలు ఏవీ లేవు కనుక ఆయన నేడు టిడిపిలో చేరబోతున్నారు. ఈరోజు ఉదయం ఆయన నెల్లూరు నుంచి 300 కార్లతో, వందలాదిమంది అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరిలో టిడిపి కార్యాలయానికి బయలుదేరారు. నెల్లూరులో బయలుదేరుతున్నప్పుడు పలువురు మహిళలు ఎదురువచ్చి హారతులిచ్చి గిరిధర్ రెడ్డిని పంపించారు. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గిరిధర్ రెడ్డి తన అనుచరులతో కలిసి మంగళగిరిలోని టిడిపి కార్యాలయానికి చేరుకొని చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరబోతున్నారు.

బహుశః ఎన్నికల గంట మ్రోగిన తర్వాత ఆయన సోదరుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టిడిపిలో చేరడం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిపై పోటీ చేయడం ఖాయమే.

వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా టిడిపిలో చేరవచ్చు. టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు చెప్పింది నిజమే అయితే వైసీపీ నుంచి మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల గంట మ్రోగగానే టిడిపిలోకి రావచ్చు. వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వకుండా జగనన్న జలక్ ఇవ్వబోయే మరికొందరికి టిడిపి లేదా జనసేనలే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి.