koratala-siva-sit-drugs- racketరాజకీయాలపై సంచలన ట్వీట్స్ చేసి ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివను వివరణ అడిగేందుకు ఓ మీడియా ఛానల్ పలకరించగా, వర్తమాన రాజకీయ వ్యవస్థపై తన భావాలను పంచుకున్నారు కొరటాల. “విద్యావ్యవస్థ దీనావస్థకు చేరుకుందని, ఎంత స్థాయికి దిగజారిందంటే విద్య మీద ఎవరికీ గౌరవం లేదని, వ్యవస్థను బాగుచేయాలన్న కోరిక ఎవరిలోనూ లేదని” ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రజలు రాజకీయాలను, రాజకీయ వ్యవస్థను గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారని, రాజకీయ నాయకులు ఏం చేసినా సరే అని ప్రజలు అనుకుంటున్నారని, ప్రజలంటే రాజకీయ నాయకులకు చాలా చులకని భావన ఏర్పడిందని, ఒక్క బిస్కెట్ వేస్తే ప్రజలంతా నోర్మూసుకుంటారని రాజకీయ నాయకుల అభిప్రాయమని వర్తమాన రాజకీయాలను ఏకరువు పెట్టారు. అవినీతి ఆల్ టైమ్ గ్రేట్ రికార్డుకు చేరుకుందని, దానిపై రాజకీయ నాయకుల్లో ఒక రూట్ మ్యాప్ లేదని అన్నారు.

దేశాన్ని వందల సమస్యలు పట్టి పీడిస్తున్నాయని, వాటిపై ఎందుకు రాజకీయ నాయకులు సరైన స్టాండ్ తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ… ఎవరో వస్తారు దేశాన్ని మార్చేస్తారు… ఇంకెవరో వచ్చేస్తారు రాష్ట్రాన్ని మార్చేస్తారని ఎదురు చూడడమే కానీ, ఆ ఎవరో రావడానికి ప్రజలు మాత్రం ఏమీ చేయడం లేదని, ప్రజలు మారితే వ్యవస్థ మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.

సమాజంలో సమస్యలపై ప్రజలను మేల్కొల్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మన కులం వాడు, మన మతం వాడు, మన ప్రాంతం వాడు, మనకి చెందిన వాడు తప్పు చేసినా వాడిని వెనకేసుకుని వస్తున్నామని… ఈ విధానం వల్లే వివిధ రంగాలు ప్రజలపై పెత్తనం చలాయిస్తున్నాయని… ఈ విధానం మారాలంటే ముందు ప్రజలు మారాలని… తప్పు చేసినవాడు ఎవడైనా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

డ్రగ్స్ విషయంలో ఆరు రోజుల పాటు విచారణ అద్భుతంగా సాగిందని, ఆ విచారణ చూసిన తరువాత ప్రజల్లో కూడా మార్పు గమనించానని, అయితే అదే ఇంటెన్సిటీ చివరి వరకు ఎందుకు కొనసాగలేదో తనకు అర్ధం కాలేదని పేర్కొన్నాడు. అలాంటి వేగం, అలాంటి చిత్తశుద్ధి, అలాంటి ప్రయత్నం ఉంటే దేశంలో సమస్యలు ఒక్కొక్కటిగా మాయమవుతాయని అశాభావం వ్యక్తం చేశాడు. ఇదేమీ తన ‘భరత్ అనే నేను’ సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్నది కాదని, తన ప్రతి సినిమాలోనూ సమాజానికి లేదా ప్రజలకు అవసరమయ్యే ఏదో ఒక అంశాన్ని చూపించే ప్రయత్నం చేస్తానని కొరటాల శివ తెలిపారు.