Koratala Siva - Rajamouliరాబోయే రెండు నెలల్లో రెండు మల్టీస్టారర్ మూవీస్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అందులో ఒకటి రాజమౌళి “ఆర్ఆర్ఆర్” దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా, మరొకటి కొరటాల శివ “ఆచార్య” కేవలం తెలుగులో మాత్రమే విడుదల అవుతోంది. ‘మల్టీస్టారర్’ అన్న ట్యాగ్ తప్ప ఈ రెండు సినిమాలకు మరే పోలిక లేదు.

తాజాగా రిలీజ్ అయిన రామ్ చరణ్ సిద్ధా “ఆచార్య” టీజర్ తర్వాత ఆ ‘మల్టీస్టారర్’ ట్యాగ్ హాట్ టాపిక్ అయ్యింది. సిల్వర్ స్క్రీన్ పైన ఈ రెండు మల్టీస్టారర్ మూవీస్ ఏ విధంగా హైలైట్ అవుతాయో తెలియాలంటే మరో రెండు నెలల సమయం ఉంది గానీ, ప్రస్తుతం రిలీజ్ అయిన టీజర్ల లెక్క ప్రకారం, ప్రేక్షకులకు కిక్ ను పంచడంలో ఏ డైరెక్టర్ సఫలీకృతం అయ్యారు అన్న చర్చకు సోషల్ మీడియా తెరలేపింది.

వెండితెరపై నందమూరి – మెగా హీరోల కలయిక ఎప్పటినుండో ప్రేక్షకుల కల. అది ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా సాకారం కాబోతోంది. అందుకు తగ్గట్లుగానే తారక్ – చరణ్ లు కలిసి కనిపంచిన ‘నాటు నాటు’ అన్న పాటకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. నిజానికి పాటలో అంత విషయం లేకపోయినా, కేవలం ఈ ఇద్దరు హీరోలు కనిపించారనే ‘నాటు నాటు’ తెలుగు నాట హంగామా చేసింది.

‘ఆచార్య’ తండ్రి కొడుకులైన చిరు – చెర్రీల కాంబో కోసం మెగా అభిమానులు కూడా ‘మగధీర’ నుండి వేచిచూస్తున్నారు. ‘బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150’లలో అలా తళుక్కుమన్న వీరిద్దరూ ‘ఆచార్య’లో పూర్తి స్థాయిలో కనిపించనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మాదిరి పాట ద్వారా ఈ ఇద్దరు హీరోలు కనిపించలేదు గానీ, హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ కొరటాల ఇచ్చిన షాట్ మాత్రం కావాల్సినంత కిక్ ను పంచింది.

కొరటాల చూపించిన ఈ షాట్ ఒక్క మెగా అభిమానులకే కాదు, యావత్తు సినీ ప్రేక్షకులకు కూడా బ్రహ్మాండంగా నచ్చేసింది. దీంతో రాజమౌళి “ఆర్ఆర్ఆర్” మల్టీస్టారర్ ‘నాటు నాటు’ డాన్స్ షాట్స్ కంటే, ప్రస్తుతం కొరటాల “ఆచార్య” మల్టీస్టారర్ హీరోయిజం ‘టైగర్’ షాట్స్ ప్రేక్షకులను ఎక్కువగా రంజింపచేయడంలో విజయవంతం అయ్యింది.