koratala-siva-sit-drugs- racketసినీ ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతోన్న డ్రగ్స్ కేసుపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్న విషయం తెలిసిందే. ఎక్సైజ్ అధికారులకు తామే దొరికామా…అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే… సిట్ అధికారులకు సహకరిస్తే పోయేదేముంది… మన నిజాయితీనే బయట పడుతుంది కదా… అంటూ పోసాని కృష్ణమురళీ వంటి వారు మీడియా వేదికలుగా వ్యక్తపరుస్తున్నారు. ఈ జాబితాలోనే తాజాగా దర్శకుడు కొరటాల శివ తన భావాలను ట్విట్టర్ వేదికగా వ్యక్తపరిచారు.

“మన సమాజంలో డ్రగ్స్ కు మించిన భయంకరమైన అంశం ‘అవినీతి’ అనేది ఒకటుందని, అన్ని ప్రభుత్వాలు కూడా సిట్ ను ఏర్పాటు చేసి ఆ అవినీతి అంతమొందిస్తాయని ఆశిస్తున్నానని, వారు చేయాలనుకుంటే చేయగలరంటూ…” తన భావాలను వ్యక్తపరిచారు. ఎన్నడూ లేని విధంగా గత నాలుగు రోజులలో ‘అవినీతి’కి సంబంధించిన అంశాలను రెండింటిని రీ ట్వీట్ చేసిన కొరటాల, తాజాగా నేరుగా అవినీతి అనేది దేశానికి పట్టిన పెనుభూతంగా అభివర్ణించారు.

తన సినిమాలను సందేశాత్మకంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తులైన కొరటాల శివ, ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబుతో “భరత్ అనే నేను” సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో పాత్ర ముఖ్యమంత్రిది కావడంతో, రియల్ గా సాధ్యం కానటువంటి అవినీతి అంతమొందించే అంశాన్ని, కనీసం రీల్ లైఫ్ లో అయినా అమలు సాధ్యమయ్యే విధంగా చూపిస్తారేమో వేచిచూడాలి. సాధారణంగా సినిమా విషయాలు తప్ప సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో పెద్దగా స్పందించని కొరటాల, ఇటీవల ఎందుకు స్పందిస్తున్నారు? అన్నది ట్రేడ్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.