koratala-siva-sit-drugs- racket‘భరత్ అనే నేను’ సినిమా ఇంకా విడుదల కాలేదు గానీ, ఈ సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ తో కొరటాల శివ తదుపరి చిత్రంలో ఏ హీరో నటిస్తారా? అన్న చర్చ టాలీవుడ్ వర్గాల్లో బలంగా జరుగుతోంది. దర్శకుడిగా రాజమౌళి మాదిరి అపజయం ఎరుగకుండా సాగుతోన్న కొరటాల శివ, ఇప్పటికే ఫస్ట్ హ్యాట్రిక్ ను ముగించి, ‘భరత్ అనే నేను’ ద్వారా రెండవ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టబోతున్నారు.

ఇటీవల హల్చల్ చేసిన టాక్ ప్రకారం అక్కినేని అఖిల్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని పేర్లు వినిపించాయి. కానీ నాని స్వయంగా అలాంటిదేమీ లేదని తెల్చేయగా, రామ్ చరణ్ ఏమో బోయపాటి, రాజమౌళి సినిమాలతో కాబోతున్నారు. ఇక అఖిల్ కూడా ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరితో జత కట్టబోతున్న నేపధ్యంలో అల్లు అర్జున్ ఒక్కడే ‘నా పేరు సూర్య’ తర్వాత దేనికి కమిట్ కాలేదు.

కానీ ఇటీవల ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడన్న బలంగా వినిపించిన నేపధ్యంలో… కొరటాల నెక్స్ట్ హీరో ఎవరన్న ప్రశ్న నేరుగా శివకే ఎదురైంది. అయితే దీనిపై ప్రస్తుతం స్పష్టత లేదని, వరుసగా నాలుగు పెద్ద సినిమాలతో అస్సలు విశ్రాంతి లేదని, ‘భరత్ అనే నేను’ విడుదల తర్వాత ఓ రెండు, మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కొత్త సినిమాను ప్రారంభిస్తానని స్వయంగా వెల్లడించారు.