మిక్కిలినేని సుధాకర్ కొరటాల శివ స్నేహితుడిగా సినీ వర్గాలకు సుపరిచితుడు. ఎస్ క్రియేషన్స్ పేరుతో గుంటూరులో సినిమాల పంపీణీ చేస్తుంటారు. మొన్న ఆ మధ్య యువసుధ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాని నిర్మించడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసారు. ఇది ఇలా ఉండగా సుధాకర్ ఇప్పుడు వైజాగ్ మీద కన్నేశారు.

కొరటాల చిరంజీవి చిత్రంతో ఆయన వైజాగ్ లో చిత్రపంపిణీ రంగంలోకి ఎంటర్ కాబోతున్నారు. ఆ చిత్రం ఉత్తరాంధ్ర రైట్స్ ని సుధాకర్ దక్కించుకున్నారు. ఇప్పటికే నిజాం రైట్స్, దిల్ రాజు మాజీ పార్టనర్ లక్ష్మణ్ దక్కించుకున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు అనే వార్తలతో ఈ సినిమా మీద ట్రేడ్ కు బాగా ఆసక్తి ఉంది.

ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ అనుకుంటున్నారు. ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సోషల్ మెసేజ్‌తో కూడిన మంచి కమర్షియల్ సినిమాలు తీయడంలో కొరటాల దిట్ట అని ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు ఈ కోవకు చెందినవే.

ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమా కూడా సోషల్ మెసేజ్‌తో కూడుకుని ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను మేట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌ (చిరంజీవి సొంత బ్యానర్) పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం చిరంజీవి నక్సలైట్ గా మారనున్నారని సమాచారం.