koratala siva about kajal aggarwal role edit in acharyaఈ నెల 29న రిలీజ్ కాబోతున్న ఆచార్య సినిమాలో దర్శకుడు కొరటాల శివ కొన్ని సన్నివేశాలు రీషూట్ చేశారని, దానిలో చిరంజీవికి జోడీగా నటించిన కాజల్‌ అగర్వాల్‌కు సంబందించిన కొన్ని సీన్స్ కొన్ని కత్తిరించేశారని ఊహాగానాలు వినిపించాయి. అయితే అప్పుడు వాటిపై కొరటాల శివ స్పందిస్తూ రీషూట్ చేయలేదని, అయినా సినిమాను ఇంకా ఇంప్రూవ్ చేసేందుకు అవసరమైతే రీషూట్ చేయడం తప్పు కాదని అన్నారు. అయితే కాజల్‌ని తొలగించినట్లు అప్పుడు ఆయన దృవీకరించలేదు. కనుక సినిమాలో ఆచార్యలో కాజల్ ఉంటుందనే అందరూ భావించారు.

కానీ తాజా ఇంటర్వ్యూలో కాజల్‌ని ఆచార్య నుంచి పూర్తిగా తొలగించినట్లు కొరటాల శివ స్వయంగా చెప్పారు. సినిమాలో నక్సల్ భావజాలం కలిగిన చిరంజీవి, తన అభిమానులను సంతృప్తిపరచడం కోసం కాజల్‌తో రొమాన్స్ చేయడం డ్యూయెట్లు పాడటం సరికాదేమో? అని తనకు సందేహం కలగడంతో అదే విషయం చిరంజీవికి చెప్పగా, ఆయన ఈ కధకు ఎలా బాగుంటుందని భావిస్తే అలా చేయమని చెప్పారని కొరటాల శివ చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తనకు ఈ ఆలోచన వచ్చిందని చెప్పారు.

ఇదే విషయం కాజల్‌ అగర్వాల్‌కు చెప్పడంతో ఆమె కూడా అర్ధం చేసుకొని ‘ఆచార్యను మిస్ అవుతున్నందుకు బాధ పడుతున్నానని’ చెప్పి సినిమా నుంచి తప్పుకొన్నారని కొరటాల శివ చెప్పారు. అంటే ఆచార్య నుంచి కాజల్‌ అగర్వాల్‌ను తప్పించి చాలా కాలమే అయ్యిందన్నమాట!

అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో కుంమ్రుం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలతో రాజమౌళి ‘నాటు నాటు…’ అంటూ డ్యాన్సులు చేయించినప్పుడు, రాఘావేంద్రరావు సినిమాలలో భక్తరామదాసు, షిరిడీ సాయిబాబా పాత్రల చేత డ్యాన్సులు చేయించినప్పుడు తప్పుగా అనిపించనిది ఓ కల్పిత పాత్ర అయిన ఆచార్య నక్సల్ భావాలు కలిగి ఉన్నవాడు కనుక కాజల్‌ అగర్వాల్‌తో రొమాన్స్ చేయడం, డ్యూయెట్స్ చేయడం సరికాదనుకొన్నారంటే ఏమాత్రం నమ్మశక్యంగా లేదు.

కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, అదే సమయంలో ఆమె గర్భం దాల్చడం వలన ఆమెను తొలగించి ఉండవచ్చు లేదా ఆమె స్వయంగా తప్పుకొని ఉండవచ్చు. ఈ నెల 19న కాజల్‌ అగర్వాల్‌ పండంటి మొగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఆచార్యలో కాజల్‌ అగర్వాల్‌ చేసిన ‘లాహే..లాహే..’ పాట ఉంటుందా లేదా?అంటే అది సినిమాలో చూడవలసిందే అని చెప్పారు. కనుక ఉంటుందనే భావించవచ్చు.

కనుక సినిమాలో ఆ పాటను ఉంచి, తరువాత కాజల్‌ అగర్వాల్‌ను తొలగించి, అందుకు తగ్గట్లుగా కధను మార్పు చేసుకొన్నందునే ఆచర్యను రీ షూట్ చేసి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఆచార్యలో కాజల్‌ అగర్వాల్‌ లేదని కొరటాల శివ స్వయంగా చెప్పారు కనుక అభిమానులు చిరంజీవి డ్యూయెట్స్ కోసం ఎదురుచూసి నిరాశ చెందక్కరలేదు.