Konda Surekha TRS Politicsకొండా సురేఖ… రాష్ట్ర విభజనకు ముందు వరకు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొండా సురేఖ మరియు భర్త మురళీ పేర్లు ఏ రేంజ్ లో హల్చల్ చేసాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వైఎస్సార్ మరణం తర్వాత కూడా జగన్ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి, అంతే స్థాయిలో కొండా సురేఖ తన విధేయతను చాటుకుని రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు.

ఆ తర్వాత జగన్ పార్టీ తరపున పోటీ చేయడం… ఓటమి పాలు కావడం… కాలక్రమేణా జగన్ పోకడతో విసుగు చెందిన కొండా దంపతులు… వైసీపీని వీడిపోవడం… అధికార టీఆర్ఎస్ లోకి చేరడం జరిగిపోయాయి. ఒకప్పుడు మీడియా వర్గాలలో ఎప్పుడూ హైలైట్ గా నిలిచిన కొండా దంపతుల పేర్లు… గత కొంతకాలం నుండి అసలు వినిపించడమే మానేసాయి. ఒక విధంగా చెప్పాలంటే… అసలు క్రియాశీలక రాజకీయాలలో వీరు ఉన్నారా..? అనే స్థాయిలో కొండా సురేఖ అండ్ కో నిలిచిపోయారు.

సహజంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటే పుట్టుకొచ్చే పుకార్లే కొండా సురేఖ దంపతులపై లేటెస్ట్ గా పుట్టుకొచ్చాయి. టీఆర్ఎస్ పార్టీకి కూడా ‘టాటా’ చెప్పే యోచనలో వీరు ఉన్నారని, త్వరలోనే మళ్ళీ సొంత గూటికి చేరే ఆలోచనలు చేస్తున్నారన్న వార్తలతో తెరపైకి వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు రాజకీయ పరంగా దివంగత రాజశేఖర్ రెడ్డి తనకు జన్మనిస్తే, కేసీఆర్ పునర్జన్మను ఇచ్చారని, తాము టీఆర్ఎస్ ను వీడబోతున్నాననేది దుష్ప్రచారం మాత్రమేనని తేల్చి చెప్పారు.

తామంటే గిట్టని వ్యక్తులే సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ కొండా సురేఖ, తన రాజకీయ వారసులు కుమార్తె సుస్మితా పటేలే అని… అయితే 2019 ఎన్నికల్లో ఆమె పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ మారడం లేదన్న విషయమైతే స్పష్టత ఇచ్చారు గానీ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఎందుకు ఉంటున్నారనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. రాజకీయ వర్గాలలో పార్టీలకు దూరంగా ఉంటే… ఇలాంటి పుకార్లు పుట్టుకురావడం కొత్తేమీ కాదు. ఇన్నాళ్ళు రాజకీయాలలో ఉన్న సురేఖకు తెలియని విషయం అంతకంటే కాదు..!