konathala ramakrishna will join tdp
కొంత కాలంగా ఉత్తరాంధ్ర హక్కుల కోసం పోరాటం చేస్తున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కొణతాల కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. విశాఖ రైల్వేజోన్‌ కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 28న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీడీపీలో చేరాక ఆయన అనకాపల్లి పార్లమెంటు సీటు అడిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే సిట్టింగు ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ మారడంతో ఆ స్థానం కోసం గట్టి అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది తెలుగుదేశం పార్టీ. దానికి కొణతాల కరెక్టు అభ్యర్థి అని భావిస్తున్నారు చంద్రబాబు. దీనితో ఆయన రాకకు దాదాపుగా మార్గం సుగమం అయ్యిందనే చెప్పుకోవాలి. గతంలో ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. ఆ తర్వాత వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో ప్రముఖంగా పనిచేశారు. ఎన్నికల తరువాత జగన్ పై తీవ్రమైన ఆరోపణలు చేసి పార్టీ నుండి బయటకు వచ్చారు.

ఆ తరువాతి కాలంలో రాజకీయాలకు దూరం అయ్యారు. ఒక సమయంలో ఆయన జనసేనకు దగ్గరగా జరుగుతున్నారని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన విషయాలలో ఆయన సలహా తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఆయన టీడీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రయత్నించినా ఆయన ఆ వైపు చూడకపోవడం గమనార్హం. ఉత్తరాంధ్రలో రానున్న రోజులలో తెలుగుదేశం పార్టీలోకి మరిన్ని వలసలు ఉండబోతున్నాయని సమాచారం.