మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రెండు రోజుల క్రితం ఆయన హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. కొణతాలకు వైకాపా కండువా కప్పుతుందగా ముందుగా తన మీద విధించిన సస్పెన్షన్ ఎత్తి వెయ్యాలని కండిషన్ పెట్టారు. అవన్నీ తరువాత ముందు కండువా కప్పుకో అని జగన్ అనడంతో అలిగి వెనక్కు వచ్చేశారు. మీడియాకు మాత్రం పార్టీలో చేరడానికి రాలేదు కేవలం ఉత్తరాంధ్ర సమస్యలపై చర్చించడానికి వచ్చా అని చెప్పుకొచ్చారు.

సరిగా రెండు రోజుల తరువాత ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఆదివారం వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కొణతాల పేరు లేదు. మరోవైపు ఎంపీ సీట్లు సహా కొన్ని అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఖరారును తెదేపా ఇంకా పెండింగ్‌లోనే ఉంచింది. ఈ నేపథ్యంలో కొణతాల ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర రాజకీయాలలో సీనియర్ నాయకుడు అయ్యుండి ఈ నిలకడ లేనితనం ఏంటో?

కొణతాల అనకాపల్లి ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఆయన అనుచరుడు గండి బాబ్జికి పెందుర్తి సీటు అడుగుతున్నారు. పెందుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఉన్నారు. అనకాపల్లి ఎంపీ సీటు ఆడారి ఆనంద్ కు కంఫర్మ్ అయిపోయిందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా ఈ రెండు సీట్లను తెలుగుదేశం పార్టీ ప్రకటించలేదు. కావున కొణతాల కోసం చంద్రబాబు ఏమైనా మార్పులు చేస్తారేమో చూడాలి. అడిగిన సీట్లు కంఫర్మ్ చేస్తేనే కొణతాల టీడీపీలోకి వచ్చే అవకాశం ఉంది.