pawan-kalyan_kona-venkatవచ్చే ఎన్నికలలో ఎన్ని స్థానాలలో పోటీ చేస్తానో చెప్పలేను గానీ, ఖచ్చితంగా ‘జనసేన’ బరిలోకి దిగుతుందని, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలు చేస్తున్న పవన్, మరో పక్కన అండర్ గ్రౌండ్ లో పార్టీని సంస్థాగతంగా కూడా బలోపేతం చేస్తున్నారన్న టాక్ వినపడుతోంది. అయితే వచ్చే ఎన్నికలలో ‘జనసేన’ తరపున బరిలోకి దిగాలనుకుంటున్న ఆశావహులు ఇప్పటినుండే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఇప్పటికే ఓ సినీ ప్రముఖుడికి గ్రీన్ సిగ్నల్ లభించిందని సినీ, రాజకీయ వర్గాల్లో ఓ టాక్ వినపడుతోంది.

పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా, ప్రముఖ సినీ రచయితగా ఉన్న కోన వెంకట్ వచ్చే ఎన్నికలలో పవన్ ‘జనసేన’ తరపున బరిలోకి దిగే అవకాశాలు కనపడుతున్నాయన్న వార్తలు ట్రేడ్ వర్గాల్లో సందడి చేస్తున్నాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అంతిమ లక్ష్యంగా రాజకీయాల్లో ఓ ఎమ్మెల్యే గానీ, ఎంపీ కావాలన్న అభిలాషను కోన వెంకట్ వ్యక్తపరచడమే, ఈ వార్తలు పుట్టుకు రావడానికి ప్రధాన కారణం. పవన్ కు బాగా సన్నిహితంగా మెలిగే వ్యక్తులలో కోన వెంకట్ కూడా ఒకరన్న విషయం ఇండస్ట్రీ వర్గాలకు తెలిసిందే.

దీంతో కోన వెంకట్ కనుక రాజకీయాల్లోకి వస్తే, అది ఖచ్చితంగా ‘జనసేన’ తరపున మాత్రమే ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది. కోన వెంకట్ పై ‘జనసేన’ అధినేత కూడా సుముఖంగా ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే త్వరలోనే తానూ దర్శకత్వం వహిస్తాను అని గత కొన్ని సంవత్సరాలుగా చెప్పిన కోన వెంకట్ డైరెక్టర్ కావాలనే లక్ష్యం ఏమైనట్లు..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బహుశా ఆ స్థానంలోనే రాజకీయ గమ్యం ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు అని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.