Komatireddy Venkat Reddy opposes congress and tdp ts allianceటీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ లో మొదటి సారిగా అసమ్మతి వచ్చినట్టుగా కనిపిస్తుంది. పొత్తు పై అధిష్టానం పునరాలోచించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. టీడీపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు.

పొత్తుపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నిశితంగా వివరిస్తానని చెప్పారు. మహాకూటమిలోని పక్షాలను కేవలం పది సీట్లకు మాత్రమే పరిమితం చేయాలని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్‌కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. మరోవైపు వామపక్షాలతో చర్చించడానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఢిల్లీ వెళ్లనున్నారు.

కోమటిరెడ్డి కూడా త్వరలోనే ఢిల్లీకి వెళ్లి రాహుల్‌ను కలిసి పొత్తుపై మాట్లాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే పార్టీ హై కమాండ్ తో సంప్రదించకుండానే ఉత్తమ్ అంత ముందుకు వెళ్లి ఉండరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పొత్తు ఉండటం ఖాయమని, అది కాంగ్రెస్ కు మంచి చేస్తుందో చేటు చేస్తుందో కాలమే సమాధానం చెప్పాలని వారు అంటున్నారు.