Komatireddy Rajagopal Reddy resigns MLA postతెలంగాణలో టిఆర్ఎస్‌ ధాటికి కుదేలైన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందనుకొంటే ఆ పార్టీలో 34 ఏళ్ళుగా ఉన్న సీనియర్ నేత, మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తే కొన్ని రోజుల తర్వాత అంతా సద్దు మణుగుతుంది కానీ ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడ్డట్లయింది. ఆయన రాజీనామాతో ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలలో పోటీ చేయవలసి రావడం, ఆ సీటును మళ్ళీ గెలిపించుకోవడానికి కాంగ్రెస్‌కు తిప్పలు మొదలయ్యాయి.

ఈ తలనొప్పితో బాధ పడుతుంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానో లేదా పొరపాటునో నోరు జారి, “కోమటిరెడ్డి బ్రదర్స్… అంటూ నిన్న చేసిన తీవ్ర విమర్శలు పార్టీలో మరో చిచ్చు రగిల్చాయి. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “నా సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరుతుంటే, రేవంత్‌ రెడ్డి నేను కూడా పార్టీ వీడి బిజెపిలో చేరబోతున్నాన్నట్లు మాట్లాడటం సరికాదు. నేను 34 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. ఎప్పటికీ ఉంటాను కూడా. కానీ బయట నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి నా వంటి సీనియర్ గురించి ఈవిదంగా మాట్లాడటం చాలా తప్పు. ఆయన తన మాటలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలి,” అని డిమాండ్ చేశారు.

దాంతో కాంగ్రెస్‌ అధిష్టానం కలుగజేసుకొని రేవంత్‌ రెడ్డికి మొట్టికాయలు వేసి క్షమాపణలు చెప్పించవలసి వచ్చింది. .

తెలంగాణ కాంగ్రెస్‌లో నేతలు ఈవిదంగా కుమ్ములాడుకొంటుంటే, ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, “కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా మాతో టచ్చులోనే ఉన్నారు. ఆయన కూడా మా పార్టీలో చేరుతారని భావిస్తున్నాము,” అంటూ బాంబు పేల్చి, మళ్ళీ ఈరోజు “తూచ్! నేను అలా అనలేదంటూ…’ సవరణ ప్రకటన చేశారు.

కాంగ్రెస్ పార్టీలో ఎవడి గోల వాడిదే అన్నట్లు, రేవంత్‌ రెడ్డి-కోమటిరెడ్డి బ్రదర్స్ మద్య యుద్ధం కొనసాగుతుండగా, మరో సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కుమార్‌ ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దివంగత కాంగ్రెస్‌ నేత, టిఆర్ఎస్‌ కార్పొరేటర్ విజయరెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకొని ఆమెకు ఖైరతాబాద్ టికెట్ ఇస్తానని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చినందుకు అలిగి ఆయన రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.