కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నప్పుడు ఆవేశంగా చెప్పిన ఆవు-పులి కధ ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకొంది. కొన్ని రోజుల క్రితం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, “గంగి గోవు వంటి కాంగ్రెస్ పార్టీని చంపేసి పులి వంటి బిజెపిని తెచ్చుకొన్నారు కేసీఆర్. ఇప్పుడు ఆ ఫులే ఆయనను మింగేయడానికి వస్తోంది,” అని అన్నారు.
అది నూటికి నూరు శాతం నిజమని అందరూ అంగీకరిస్తారు. సిఎం కేసీఆర్ కాంగ్రెస్ జోలికి వెళ్ళకుంటే కాంగ్రెస్ నేతలు వారిలో వారే పదవుల కోసం కీచులాడుకొంటూ కాలక్షేపం చేస్తుండేవారు. కానీ సిఎం కేసీఆర్ టిఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి పార్టీలో చేర్చుకొన్నారు. దాంతో కాంగ్రెస్ స్థానంలోకి రాజగోపాల్ రెడ్డి చెప్పిన బిజెపి అనే పులి ప్రవేశించి సిఎం కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాండ్రించడం మొదలుపెట్టింది.
అయితే రాజగోపాల్ రెడ్డి తాను బిజెపిలోకి వెళ్ళబోతున్నాననే సంగతి మరిచినట్లు దానిని పులితో పోల్చారు. ఇప్పుడు అదే ఆయన మెడకు చుట్టుకొంటోంది. “రాజగోపాల్ రెడ్డి పులి మీద సవారీ చేయబోతున్నారు. ఏదో ఓ రోజు అది ఆయననే తినేస్తుంది,” అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొనప్పుడు ఆయన కూడా కాంగ్రెస్, బిజెపిలను గంగిగోవు, పులితో పోల్చడం గురించి ప్రశ్నించగా రాజగోపాల్ రెడ్డి చాలా ఉత్సాహంగా మళ్ళీ అదే సమాధానం చెప్పారు.
అయితే “పులి మీద ఎప్పటి నుంచి సవారీ చేయబోతున్నారు?” అని రాధాకృష్ణ ప్రశ్నించేసరికి రాజగోపాల్ రెడ్డి ఒక్క క్షణం షాక్ అయ్యారు. అప్పుడు గానీ తాను పొరపాటు మాట్లాడినట్లు గుర్తించలేకపోయారు. తేరుకొని “అవును పులి మీద స్వారీ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి…,” అంటూ సర్దిచెప్పుకొనేందుకు తంటాలు పడుతుంటే, రాధాకృష్ణ అది గమనించి వేరే టాపిక్ మీదకు డైవర్ట్ చేసి కాపాడారు. కనుక రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఎన్నడూ ఈ ఆవు-పులి కధ చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆయన పులి మీద సవారీ చేస్తున్నారు… దానికి కోపం వస్తే మింగేస్తుంది కనుక!