Kolla-Lalitha-Kumari-TDPటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో టిడిపి నేతలు, కార్యకర్తలు రేషన్ షాపులలో పేదలకు ఉచిత బియ్యం అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేసి వైసీపీ ప్రభుత్వానికి నిరసనలు తెలుపుతున్నారు.

ఈ అంశంపై విజయనగరం, పారవేతీపురం, మన్యం జిల్లాలలో టిడిపి శ్రేణులు చాలా ఉదృతంగా పోరాడుతున్నాయి. గురువారం నెల్లిమర్లకు చెందిన టిడిపి నేతలు ఆనంద్ కుమార్, రవి శేఖర్ పార్టీ శ్రేణుల పాదయాత్రగా వెళ్ళి డెప్యూటీ తహశీల్దార్‌కి వినతిపత్రం ఇచ్చారు.

ఎస్.కోట, పూసపాటిరేగ, నెల్లిమర్ల, గరివిడి, రేగిడి, చీపురుపల్లి, మెరకముడిదాం, దత్తి రాజేరు,రామభద్రపురం, గుర్ల, బొబ్బిలి, గజపతినగరం, రాజాం, భోగాపురంలో టిడిపి శ్రేణులు “ఉచిత రేషన్ ఎగ్గొట్టొద్దు… పేదల కడుపు కొట్టొద్దు,” అని ముద్రించిన బ్యానర్లు పట్టుకొని పాదయాత్రగా వెళ్ళి స్థానిక తహశీల్దార్, రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్.కోటలో మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి విలేఖరులతో మాట్లాడుతూ, “నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని వైసీపీ నేతలు పక్కదారి పట్టించేసి అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసి డబ్బు సంపాదించుకొంటున్నారు. ఆ అవకాశం లేని వైసీపీ నేతలు బ్లాక్ మార్కెట్‌కు తరలించి అమ్ముకొంటున్నారు. అందుకే మూడు నెలలు ఉచిత బియ్యం ఇవ్వడంలేదు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఇస్తున్న బియ్యాన్ని కూడా వైసీపీ నేతలు అమ్ముకొనే స్థాయికి దిగజారిపోయారు,” అని ఆక్షేపించారు.