kolkata knight riders vs rising pune supergiantsఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10లో ‘కింగ్ ఖాన్’ షారుక్ ఖాన్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విశేషంగా రాణిస్తోంది. కీలకమైన అన్ని మ్యాచ్ లలోనూ విజయాలను అందుకుంటూ టాప్ స్థానానికి చేరుకుంది. తాజాగా పూణేపై జరిగిన మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోల్ కతా అవలీలగా విజయాన్ని సాధించింది. టాస్ గెలిచి పూణేకు బ్యాటింగ్ అప్పగించగా, నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. ఓపెనర్లు రెహానే 46, త్రిపాఠి 38 పరుగులతో రాణించగా, కెప్టెన్ స్మిత్ 51 పరుగులతో అజేయంగా నిలిచాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా ఆదిలోనే నరైన్ (16) వికెట్ ను కోల్పోయినప్పటికీ, గౌతం గంభీర్ – రాబిన్ ఊతప్పల జోడి పూణేకు ఛాన్స్ ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించారు. ముఖ్యంగా ఊతప్ప భారీ షాట్లతో విరుచుకుపడుతూ 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 పరుగులు చేసి మ్యాచ్ ను కోల్ కతా వైపుకు తిప్పాడు. 12 పరుగుల వద్ద ఊతప్ప అందించిన క్యాచ్ ను పట్టుకోవడంలో విఫలమైన పూణే జట్టు, దానికి తగిన మూల్యం చెల్లించుకుంది. మరో వైపు గంభీర్ 46 బంతుల్లో 62 పరుగులు చేసి ‘ఆరంజ్’ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.

ఈ విజయంతో ఆడిన 8 మ్యాచ్ లలో 6 విజయాలను సొంతం చేసుకుని మెరుగైన రన్ రేట్ తో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇవే పాయింట్లతో ముంబై ఇండియన్స్ జట్టు 2వ స్థానంలో ఉండగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 9 పాయింట్లతో మూడవ స్థానంలో, 8 పాయింట్లతో పూణే జట్టు నాలుగవ స్థానంలో నిలిచాయి. కోల్ కతా, ముంబై, హైదరాబాద్ జట్లు టాప్ 4లో మూడుగా దాదాపుగా ఖరారు కాగా, నాలుగవ జట్టు కోసం హోరాహోరీ పోరు జరుగుతోంది. అయితే నాలుగవ జట్టు ఖరారు కావాలంటే మరో వారం ఆగాల్సిందే.